Telangana Caste Census
తెలంగాణ

Telangana Caste Census: నేషనల్ ఇష్యూగా కులగణన

  • దేశానికే ఆదర్శంగా తెలంగాణ కార్యాచరణ
  • రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా ‘ఇండియా’ కూటమి పార్టీలతో ఇక భేటీలు
  • జనాభా లెక్కలు తేలితేనే సంక్షేమం బడ్జెట్
  • ‘జనగణనలో కులగణన’ డిమాండ్‌తో ఫైట్
  • పార్లమెంటు ఆమోదం కోసం బీజేపీపై ఒత్తిడి

Telangana Caste Census: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా భావించిన కులగణన త్వరలో నేషనల్ ఇష్యూగా మారనున్నదా? అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ రోల్ మోడల్‌ కానున్నదా? ఈ తరహా ప్రక్రియకు పలు ప్రాంతీయ పార్టీలు మొగ్గు చూపనున్నాయా? కేంద్రంపై ఆ మేరకు ఒత్తిడి పెరగనున్నదా? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. జనాభా లెక్కల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనకబాటుతనంపై స్పష్టత వస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు బడ్జెట్‌లో నిధులను కేటాయించడానికి వీలుంటుందంటూ ఇప్పటికే పలు పార్టీల నేతలు ఓపెన్‌గానే కామెంట్ చేశారు. జనాభా లెక్కలతో పాటు కులాలవారీ లెక్కలను కూడా తీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కులగణనకు చట్టబద్ధత కల్పించి అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందనున్నది.

తెలంగాణ బాట‌లోనే…

తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు నడవడానికి కూడా మార్గం సుగమమయ్యే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లోనూ బీసీ సంఘాల నుంచి అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగే అవకాశమున్నది. కాంగ్రెస్ సైతం దీన్ని ‘నేషనల్ ఇష్యూ’గా మల్చాలని భావిస్తున్నది. సమాజానికి కులగణన ‘ఎక్స్ రే’ లాంటిదని సీఎం రేవంత్ భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయక తప్పదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారని, రాహుల్ మాట‌ల‌ను ఆచరణలో పెట్టిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు రానున్నదని సీఎం రేవంత్ శనివారం పార్టీ బీసీ నేతలతో సమావేశం సందర్భంగా గుర్తుచేశారు. దీన్ని తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

ప్రాంతీయ పార్టీల మద్దతు ప్రయత్నాలు

కాంగ్రెస్ కులగణన విధానానికి ఇప్పటికే కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు పలకగా మరికొన్ని కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలున్నాయి. ఇందుకోసం ‘ఇండియా’ కూటమి పార్టీలతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ సంప్రదింపులు జరిపి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యాచరణను రూపొందించుకోనున్నాయ‌ని తెలుస్తున్న‌ది. తెలంగాణ అనుభవాన్ని ఆయా ప్రాంతీయ పార్టీలకు వివరించి అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే కసరత్తు మొదలు కానున్నద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న, నిధుల విడుదలలో వివక్ష చూపుతున్న విధానాన్ని ఎండగట్టిన సీఎం రేవంత్.. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒకే తాటిమీదకు తీసుకురావడానికి తానే చొరవ తీసుకుంటానని కేరళలో ఇటీవల జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కులగణన విషయంలోనూ తెలంగాణ లీడ్ రోల్ పోషించే అవకాశం లేకపోలేదు. సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎండీఎంకే, ఆర్జేడీ.. ఇలాంటి పలు పార్టీలతో సమావేశమయ్యే అవకాశమున్నది.

మోదీ కులంపై వ్యాఖ్య‌ల‌తో చ‌ర్చ‌

ప్రధాని మోదీ కూడా బీసీయే అని బీజేపీ చెప్పుకొంటున్నా బీసీ సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ పదేండ్లుగా అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రధాని కులంపై సీఎం రేవంత్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలోనే చర్చకు దారితీసింది. బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధిని సమాజానికి తెలియజెప్పేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్లాన్‌ రూపొందించుకున్నది. తెలంగాణ కులగణన చట్టానికి పార్లమెంటు ద్వారా ఆమోదం తెలిపితే కాంగ్రెస్ ఆ మేరకు సక్సెస్ అయినట్లవుతుంది. ఒకవేళ తిరస్కరిస్తే ‘బీజేపీ బీసీ ద్రోహి’ అనే అపవాదు మోపడానికి కారణమవుతుంది.

బీసీ సంఘాల దీర్ఘకాల డిమాండ్

కులగణన రాహుల్‌గాంధీ బ్రెయిన్ చైల్డ్ అయినప్పకీ అనేక ప్రాంతీయ పార్టీలు ఈ విధానానికి మద్దతు పలుకుతున్నాయి. బీసీల అభివృద్ధికి ఈ విధానం తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించే కులగణన చట్టం అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మాత్రమే కాక భవిష్యత్ భారతానికి రోడ్ మ్యాప్‌గా ఉపయోగపడుతుందన్నది కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాడులో ఇప్పటికే బీసీలకు 69% రిజర్వేషన్ విధానం అమలవుతున్నది. లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా గతంలోనే రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత రావడంతో ఏ ప్రభుత్వాలూ దాని జోలికి వెళ్ళలేకపోతున్నాయి. దేశవ్యాప్తంగానూ ఇలాంటి విధానం రావాలని బీసీ సంఘాలు ఢిల్లీ కేంద్రంగానే గతంలో నిరసనలు, ధర్నాలు చేశాయి. కులగణనకు బీజేపీ సిద్ధం కాకపోతే బీసీ వ్యతిరేక పార్టీగా పరిగణించడంపైనా చర్చలు మొదలయ్యాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు