Telangana BJP: తెలంగాణ కాషాయ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అందుకే ఈ ధోరణికి చెక్ పెట్టడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలా చేయడం వల్ల వారు ఇతర పనుల్లో బిజీగా ఉండి ఆధిపత్య పోరును పక్కన పెట్టేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు.
ఇప్పుడు ప్రధానంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నది ఎంపీల్లోనే కావడంతో ఈ ఆలోచనను అమలు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లోక్ సభ సభ్యులను వారి పార్లమెంట్ సెగ్మెంట్‌కే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా ఆధిపత్య పోరుకు చెక్ పెట్టవచ్చేనే ధోరణిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు అనుకుంటున్నారు.
Also Read: Bonalu Festival: 24 చారిత్రక ఆలయాల దగ్గర ఒకేసారి వేడుక
అసలు ప్లాన్ ఇదే..
తెలంగాణ బీజేపీ (Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు (Ramchandra Rao) బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆధిపత్య పోరు క్రమంగా పెరుగుతూ వచ్చింది. కాషాయ పార్టీ పగ్గాల కోసం ఎంపీలు చాలా మంది ప్రయత్నించారు. కానీ వారిని కాదని రాంచందర్ రావు వైపు పార్టీ మొగ్గు చూపింది. దీంతో ఎంపీలను ఆయన ఎలా డీల్ చేయగలరనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రులిద్దరినీ పక్కనపెడితే ఎంపీల్లో ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావును కొత్త సారథి ఎలా డీల్ చేస్తారనే దానిపై కార్యకర్తల్లో విస్తృత చర్చ సాగుతున్నది. గోడెం నగేశ్ ఎలాగూ సైలెంట్‌గా ఉండడంతో మిగతా లోక్ సభ సభ్యులను హ్యాండిల్ చేయడంపై శ్రేణుల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారిని వారి పనుల్లో నిమగ్నం చేసి ఆధిపత్య పోరుకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం.
రాంచందర్ రావు వ్యూహం
టీ బీజేపీ కొత్త సారథి బాధ్యతలను దక్కించుకున్న రాంచందర్ రావు పార్టీ ప్రక్షాళన దిశగా ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టారు. రాష్ట్ర కమిటీలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు ప్రత్యర్థి పార్టీల నుంచి కంటే సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో ఏం చేస్తే బాగుంటుందా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కీలకమైన నేతలు ఎక్కువగా ఉండడం, వారిని బ్యాలెన్స్ చేయడం రాంచందర్ రావు ఎదుట ఉన్న అతి పెద్ద సవాల్. దీన్ని ఆయన ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకొని నిరాశకు గురైన లోక్ సభ సభ్యులు రాంచందర్ రావుకు సహకరిస్తారా లేదా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే, కీలక నేతలను ఎక్కడికక్కడ వారి లోక్ సభ స్థానాలకే పరిమితం చేసి పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా వ్యూహరచనకు ప్లాన్ చేస్తున్న రాష్ట్ర నాయకత్వం వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Also Read: Heart health: పరగడుపున ఈ ఆకులను తింటే.. గుండె వ్యాధులకు చెక్ పెట్టొచ్చని తెలుసా?