Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇక లేరు. బడి చదువు లేకుండానే ఆశు కవిగా, జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని రచించి, ఆలపించి తెలంగాణ ఉద్యమ స్పూర్తిని రగిల్చిన అందెశ్రీ గొంత మూగ బోయింది. ఉదయం లాలాపేటలోని తన నివాసంలో అందెశ్రీ ఒక్కసారిగా కుప్పకూలారు. చికిత్స నిమిత్తం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. తెలంగాణ సాహిత శిఖరం ఉన్నట్టుండి కూలిపోవటంతో రాష్ట్ర కవులు, రచయితలు, కళాకారులు హుటాహుటీన అందెశ్రీ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకుని, ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Also Read: Andesri death: ప్రజాకవి అందేశ్రీ మృతిపై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి
అందె శ్రీ ప్రస్థానం ఇలా
వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని రేబర్తి లో అందెశ్రీ 1961 జూలై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రచించి, ఆలపించిన అందె శ్రీ ప్రతి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని నింపి, తెలంగాణ ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇటీవలే సర్కారు నుంచి రూ. కోటి పురస్కారంతో పాటు రెండు డాక్టరేట్ లను ఆయన స్వీకరించారు. ఆశువు కవిత్వం చేప్పడంలో అందె శ్రీ తనకు తానే సాటి. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ఆయనకు 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం దక్కింది. 2014లో అకాడమిక్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సైతం ఆయన్ను వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారంతో పాటు లోక్ నాయక్ పురస్కారాలు అందెశ్రీని వరించాయి.
అమాత్యుల అశ్రు నివాళి
లాలాపేట జయ శంకర్ ఇండోర్ స్టేడియంలో కవులు, రచయితలు స్థానికులు, అభిమానులు, కళాకారులు ఉదయం అందెశ్రీ పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అశ్రు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి రామకృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, టీ ఎస్ ఎస్ చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ , బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు హరీష్ రావు,
తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్సీలు కోదండరాం, కల్వకుంట్ల కవిత, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, వి. హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, టీఎస్ఎస్ సంచాలకులు ఏ నరసింహారెడ్డి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మందుల సామేల్ లు అందె శ్రీ పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఇండోర్ స్టేడియంలో కవులు కళాకారులు, రచయితలు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.
రేపు అంత్యక్రియలు..హాజరుకానున్న సీఎం
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం ఘట్ కేసర్ ఎన్ ఎఫ్ సీ నగరంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, కవులు, కళాభిమానులు హాజరై అందెశ్రీ పార్దీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు.
Also Read: Ande Sri: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ కవి అందెశ్రీ కన్నుమూత
