T-Fiber Pilot Project: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీ-ఫైబర్’ గ్రామాల పైలట్ ప్రాజెక్టు (T-Fiber Pilot Project) దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో ‘తెలంగాణ’ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా కితాబుచ్చారు.
డిజిటల్ సమ్మిళత్వానికి తెలంగాణ బాటలు
ఢిల్లీలో నిర్వహించిన ‘స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీస్ రౌండ్ టేబుల్’ సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళత్వానికి తెలంగాణ బాటలు వేస్తుందని అభినందిస్తూ, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబును ప్రశంసించారు. ‘లాస్ట్-మైల్ ఫైబర్ కనెక్టివిటీ’ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించిందన్నారు. ‘టీ-ఫైబర్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలని, ఈ పైలట్ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: GHMC: రూ.1438 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్.. గతేడాదితో పోల్చితే రూ.103 కోట్లు అధికం
డిజిటల్ సమానత్వమే లక్ష్యం..
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… డిజిటల్ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది అని పేర్కొన్నారు. గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. అందుకు అనుగుణంగానే పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి, చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, వినూత్న విధానాలతో ముందుకెళ్తున్నామన్నారు. “భావతరాల కోసం పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. డిజిటల్ ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేరాలన్నదే మా లక్ష్యం” అని మంత్రి స్పష్టం చేశారు.
ఫైబర్-టు-ది-హోమ్ నెట్‌వర్క్
టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ ఇండియా, భారత్ నెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఫైబర్-టు-ది-హోమ్ నెట్‌వర్క్ ద్వారా ఈ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ వ్యవస్థాపకత వంటి సేవలను ప్రజల ముంగిటకే సమర్థవంతంగా చేర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన రేట్స్?
