MLA Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు మరో మలుపు తిరిగింది. మరోసారి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speeker Gadam Prasad Kumar)కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరపున ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy) దీనిని దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ సంజయ్ కరోల్(Justice Sanjay Karol) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, పెండింగ్‌లో ఉన్న కేసీఆర్(KCR) పిటిషన్‌కు దీనిని జత చేసి తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోపు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, స్పీకర్ ఈ ఆదేశాలను అమలు చేయలేదని, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లను పిటిషన్‌లో పేర్కొన్నారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది.
స్పీకర్ ఒత్తిళ్లకు లొంగుతున్నారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. 24 గంటలు చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం కాదని, ఆయనకు తెలంగాణ(Telangana)లో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఉల్లంఘనలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో కోర్టు ధిక్కారణ పిటిషన్ పై సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టిందని, ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఫిరాయింపులపై కాలయాపన చేస్తూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారంటూ ఏలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్పీకర్ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు.
Also Read: Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్ డుం డుం’.. వివరాలివే!

