Sports Grounds Corruption in Nalgonda
తెలంగాణ

Nalgonda: అవినీతి ‘క్రీడా’ ప్రాంగణాలు

– చదును చేయలే.. ఆట ఆడలే..
– ఆ పేరుతో గుత్తేదారులు రూ.70 లక్షల స్వాహా
– ఒక్కో ప్రాంగణానికి రూ.5 లక్షల వరకు డ్రా
– నల్లగొండ మున్సిపల్ పరిధిలో14 ఏర్పాటు
– మొద్దు నిద్ర వీడని మున్సిపల్ యంత్రాంగం

Nalgonda: ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా తయారైంది నల్లగొండ మున్సిపాలిటీ పరిస్థితి. పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని గత ప్రభుత్వం ఏరికోరి తెచ్చిన అప్పటి మున్సిపల్ కమిషనర్ ప్రజాధనాన్ని పప్పు బెల్లంలా పంచిపెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదిలావుంటే.. గత సర్కారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఒక్కో క్రీడా ప్రాంగణాన్ని రూ.5లక్షల వ్యయంతో ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని భావించింది. ఈ క్రమంలోనే నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోనే 14 క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది. అయితే పనులను దక్కించుకున్న సదరు గుత్తేదారులు కనీసం మట్టి పోయలేదు.. చదును చేయలేదు. కానీ, బిల్లులు మాత్రం స్వాహా చేసేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. కానీ నేటికీ మున్సిపల్ యంత్రాగం ఆ క్రీడా ప్రాంగణాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. నల్లగొండ మున్సిపాలిటీలో గత సర్కారు హయాంలో జరిగిన అవినీతిని నిగ్గు తేలుస్తారని భావించినా ఆ దిశగా చర్యలేమీ కనిపించడం లేదని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు.

అసలు క్రీడాప్రాంగణాల కథేంటి?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, యువత ఆటల్లో రాణించాలనే పేరుతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. దాదాపు ప్రతి గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం చొప్పున ఏర్పాటుకు నిర్ణయిం‌చింది. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోనూ దాదాపు14 క్రీడా ప్రాంగణాలను గాను.. శేషమ్మగూడెం, కతాల్‌గూడ, హౌజింగ్ బోర్డు కాలనీ, సుందరయ్యకాలనీ, చంద్రగిరి విల్లాస్, ఐటీఐ కాలేజీ, డైట్ కాలేజీ, మేకల అభినవ్ స్టేడియం, వెటర్నరీ హాస్పిటల్, ఇండోర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటిని దక్కించుకున్న అప్పటి అధికార పార్టీ గుత్తేదారులు క్రీడా ప్రాంగణంలో కం‌పచెట్లు తొలగించేందుకు రూ.10 వేలకు పైగా, మట్టి పోసి చదును చేసేందుకు రూ.2.50 లక్షలకు పైగా బిల్లులు మంజూరు చేయించుకొని జేబుల్లో వేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వంలో మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బిల్లులు డ్రా చేశారు.. వసతులు మరిచారు

ఇప్పటికే క్రీడా ప్రాంగణాలకు సంబంధించి గుత్తేదారులు బిల్లులు డ్రా చేసుకుని దాదాపు మూడేండ్లు గడుస్తోంది. కానీ క్రీడా ప్రాంగణంలో పెద్దగా వసతులు కల్పించిన దాఖలాలు లేవు. కంప చెట్లు తొలగించి.. ఆటలు ఆడేందుకు వీలుగా మట్టితో చదును చేయించాలి. అవేమీ లేకుండానే కాంట్రాక్టర్లు కేవలం బోర్డులు పాతేసి అధికారుల సాయంతో బిల్లులు డ్రా చేశారు. చిన్నపాటి వర్షం వచ్చినా క్రీడా ప్రాంగణాలు జలమయంగా మారి అడుగు పెట్టేందుకు వీలు కావడం లేదు. మున్సిపాలిటీ పరిధిలోని ఏ క్రీడా ప్రాంగణంలోనూ నిబంధనలకు అనుగుణంగా పనులు చేయకున్నా.. బిల్లులు మంజూరు చేయడం వెనుక అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కలెక్టరేట్ రోడ్డులోని డైట్ కాలేజీలో పోసిన మట్టి కుప్పలను నేటికీ చదును చేయకపోగా.. అసలు అక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారన్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. పానగల్ ఎల్లమ్మగుడి పక్కన ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం ఏ మాత్రం వర్షం వచ్చినా.. నీటితో నిండిపోవాల్సిందే. క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో జరిగిన అవినీతిని తేల్చాల్చిన ప్రస్తుత అధికారులు, పాలకులు మౌనం వహిస్తుండటం పట్ల ప్రజలు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.

ఉమ్మడి నల్లగొండలో ఇలా

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా అరెకరం నుంచి ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 603 గ్రామాల్లో, సూర్యాపేట జిల్లాలో 475 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల పేరుతో రూ.కోట్ల బిల్లులు డ్రా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 లక్షల బిల్లులు డ్రా చేశారు. కానీ నేటికీ ఏ ఒక్క క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులు ఆటలు ఆడలేదని తెలుస్తున్నది. కొన్ని చోట్ల గ్రామాల్లో స్థలం ఎంపిక చేయకున్నా.. బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సర్కారు క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించి, యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?