రాజలింగం హత్య కేసులో కొత్త కోణాలు
భూపాలపల్లి మర్డర్‌తో హైదరాబాద్ లింకు!
14 ఎకరాల గ్యాబ్ ల్యాండ్ కబ్జాను అడ్డుకున్న రాజలింగం
అదే కేసులో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారా?
ఎస్పీ కార్యాలయం ఎదుట గార్డ్ ఎందుకు లేడు?
ఆ సాయంత్రం వీధి లైట్లు ఎందుకు వెలగలేదు?
లొంగిపోవాలని నిందితులకు సూచించిందెవరు?
లొంగిన ఇద్దరికీ కత్తి ఎత్తేంత బలం ఉన్నదా?
వేల ఎకరాల వారసత్వ భూములపై గోనె వంశీకృష్ణ ఫైట్
15 రోజులుగా భూపాలపల్లికి ఎందుకు తిరుగుతున్నారు?
భూపాలపల్లిలో ఆయన ఎవరెవరిని కలిశారు?
కొత్త హరిబాబును రంగంలోకి దింపింది ఎవరు?
కొత్త హరిబాబు, నిందితుడు సంజీవ ఎన్నిసార్లు కలిశారు?
పార్టీలకు అతీతంగా ఏకమై హత్యను నీరుగార్చే యత్నం?
ఆ అవసరం ఎందుకు? ఎవరికి?
ఏకమైన అగ్రవర్ణం.. 2 గంటల్లో క్లోజ్ చేసేలా యత్నాలు!
Rajalingamurthy : వరంగల్, స్వేచ్ఛ : ఒక్క హత్య అనేక అనుమానాలకు తావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హతుడు రాజలింగ మూర్తి గతంలో కేసు వేయకపోతే ఆయన హత్య విషయంలో ఇంత చర్చ జరిగుండేది కాదేమో! ఈ హత్య కేసును నీరుగార్చేలా కొందరు వ్యవహరించిన తీరు.. ఎన్నో అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. రేణిగుట్ల ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని అందరూ ఏకమయ్యారని భూపాలపల్లి కోడై కూస్తున్నది. సాక్షాధారాలను ధ్వంసం చేసి, రెండు గంటల్లో క్లోజ్ చేసేలా ఉండాలని బహిరంగానే ఓ నేత మాట్లాడటం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ సామాజిక వర్గం వారంతా కలిసిపోయి ఈ కుట్ర చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి భూమికి అడ్డుగా వస్తున్నడనే కారణంగా అందరి కళ్లలో అనందం కోసం ఈ పని చేశామని చెప్పుకోవడం సంచలనం రేపుతున్నది. అందరూ చెబుతున్న 6 గుంటల భూమి వివాదం కాదని, 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఈ హత్యకు లింకు ఉందని తెలుస్తున్నది. దీంతో తవ్వేకొద్దీ ఇంకా ఎన్ని భయంకర నిజాలు భయటపడనున్నాయో? అనే చర్చ సాగుతున్నది. లోకల్ పోలీసులు కాకుండా ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటపడుతాయని ఈ వ్యవహారాలతో పరిచయం ఉన్నవారు చెబుతున్నారు.
వీటికి సమాధానాలేవి?
ఎస్పీ కార్యాలయం ముందు రాజలింగ మూర్తిపై కత్తులతో దాడి చేసిన సమయంలో స్ట్రీట్ లైట్స్ ఎందుకు వెలుగుతూ లేవు? హత్యకు ఉపయోగించిన కత్తిని 18 గంటలైనా పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? అనేది గమనిస్తే పోలీసులకు తెలిసే ఈ హత్య జరిగిందా? అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సాధారణంగా ప్రతి హెడ్ క్వార్టర్స్ ముందు గార్డ్ ఉంటాడు. భూపాలపల్లి లాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆ సమయంలో గార్డ్ ఎందుకు లేడన్న అనుమానాలు వస్తున్నాయి.
50 కోట్ల హిస్టరీ ఇదీ..
అటవీశాఖ భూ స్కాంపై స్వేచ్ఛ గత ఏడాది ఏప్రిల్‌లోనే కథనాన్ని ప్రచురించింది. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్.. 106 ఎకరాలు తమవే అంటూ కాపాడుకున్నది. దాని విలువ 350 కోట్లు. ఇదే భూమి పక్కన గ్యాబ్ ల్యాండ్ (ఇరు గ్రామాల మధ్య మిగులు భూమి) తమకే ఇవ్వాల్సిందిగా ముత్యంరావు అనే భూస్వామి కుటుంబం లాబీయింగ్ చేస్తున్నది. మంథనికి చెందిన వెంకట ముత్యంరావు కుటుంబానికి భూపాలపల్లి, జంగేడ్ ప్రాంతంలో 1400 ఎకరాల భూమి ఉండేది. సిలింగ్‌లో దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులో భూపాలపల్లిలో 19 ఎకరాలను ప్రభుత్వం అదనంగా తీసుకున్నదని, ఆ భూమి ప్రధాన రోడ్డుకు వచ్చేలా ఇవ్వాలని వారసుడు గొనే వెంకట వంశీకృష్ణారావు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. అదే అదునుగా నేతల సహకారంతో కలెక్టర్ కూడా 2022లో ఉత్తర్వులు ఇచ్చారు. కొంపల్లి రెవెన్యూ పరిధిలోని ఫారెస్ట్ భూములకు, భూపాలపల్లిలోని సర్వే నంబర్ 324 లోని భూములకు మధ్య భూమి కావడంతో ఈ గ్యాబ్ ల్యాండ్ ప్రభుత్వానికి చెందాల్సిందని, కానీ దానిని ప్రైవేటుపరం చేయడం తగదంటూ రాజలింగమూర్తి లీగల్ ఫైట్ చేశారు. ఫారెస్ట్ భూమిని ఎలా ఇస్తారని ఫారెస్ట్ అధికారులు అడ్డం తిరిగారు. దీనిపైనే మృతుడు అధికారుల పైనా ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీలు పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. రాజలింగం పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడంలో వంశీ కృష్ణ కేసులే కీలకంగా మారాయి. తాజాగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మళ్లీ ఫైల్ లో కదలికలు వచ్చాయి. దీన్ని అడ్డుకునేందుకు రాజలింగం లీగల్ ఫైట్ కొనసాగించారు. ఇదే భూపాలపల్లిలో ధరణి వచ్చిన తర్వాత 800 ఎకరాలు ఓ ముస్లిం కుటుంబం పేరు మీద నమోదు అయింది. ఇలా భూస్వాములు వారసత్వం అంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత రాజకీయ నేతల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఈ దందా కామన్ గా మారిపోయింది. ఎవ్వరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇక్కడ కామన్ అంటున్నారు. ఇప్పుడు ఏకంగా హత్యకు గురవ్వడంతో ఈ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి.
ఇంకా కొనసాగుతున్న విచారణ – కుటుంబ సభ్యులకు ఎన్నో అనుమానాలు!
1. కాళేశ్వరం విచారణకు ముందు ఈ హత్య ఎందుకు జరిగిందో విచారణలో తేలుస్తారా ?
2. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన గోనె వెంకట వంశీకృష్ణారావు పదే పదే ఇటీవల భూపాలపల్లికి ఎందుకు వెళ్లారు? ఎవ్వరెవరిని కలిశారు?
3. గండ్ర అనుచరుడైన హరిబాబు ఇంకా అజ్ఞాతంలోనే ఎందుకున్నాడు?
4. నిందితుల లొంగిపోయారు 2 గంటల్లోనే క్లోజ్ అవుతుందన్న పోలీసులు, పోలిటిషన్స్.. సీఎం ఆరా తీయకపోతే అలానే క్లోజ్ చేసేవారా? వీళ్లు వేసుకున్న స్కెచ్‌కు సీఎం ఆదేశాలు అడ్డంకిగా మారాయా?
5. పోలీస్ క్వార్టర్స్‌నే స్పాట్‌గా ఎంచుకోవడం వెనక సేఫ్ అనుకున్నారా?
6. హత్య కేసులో చేయాల్సిన పోలీసుల ప్రాసెస్ సరిగ్గానే జరిగిందా? హత్యకు వాడిన అసలైన కత్తి స్పాట్‌లోనే ఉన్నా ఎందుకు పరిశీలించలేదు?
7. చేసింది వాళ్లే.. వాళ్లు లొంగిపోతారు.. అంటూ ఎస్పీకి ఫోన్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన వ్యక్తులు ఎవరు?
8. 7.06 నిమిషాలకు మర్డర్ అయితే రెండు గంటల్లోనే ఇద్దరు లొంగిపోయారు. మరో ఇద్దరిని ఆపింది ఎవ్వరు?
9. ఆ రెండు గంటల్లో ఎవరెవరికి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయి? ఎలా మాట్లాడుకున్నారు?
10. ఈ నలుగురు గురి తప్పకుండా పోటు వేసేంత ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా ఎవరు తయారు చేశారు?