Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​ కేసులో బిగ్ అప్డేట్..!
Phone Tapping Case (imagecredit:twitter)
Telangana News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​ కేసులో బిగ్ అప్డేట్.. వెలుగులోకి కీలక అంశాలు

Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్​ అధికారులు గురువారం విచారించారు. రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో పలు సంచలన వివరాలు వెలుగు చూసినట్టుగా సమాచారం.

అలా బయటకు వచ్చింది

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాప్​ చేసిన విషయం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బయట పడింది. ప్రభుత్వం దీనిపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని సిట్​ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ నేతలు బండి సంజయ్​, రఘునందన్​ రావుతోపాటు పలువురు బాధితులను విచారించింది. విచారణలో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం మొత్తం అప్పట్లో ఎస్​ఐబీ ఛీఫ్‌గా ఉన్న ప్రభాకర్​ రావు కనుసన్నల్లోనే జరిగినట్టుగా వెల్లడైంది. దీంట్లో ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్​‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​ రావు, ఓ ఛానల్ యజమాని శ్రవణ్​ రావు కీలకపాత్ర పోషించినట్టుగా తేలింది. ఈ క్రమంలో సిట్​ అధికారులు వీరిని కూడా విచారించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్ట్ కూడా చేశారు.

Also Read: MLC Kavitha: ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ.. కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

రాధాకిషన్ రావు విచారణలో..

రాధాకిషన్​ రావును జరిపిన విచారణలో ఫోన్​ ట్యాపింగ్​‌కు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడైనట్టు సమాచారం. అతడిని ప్రశ్నించినపుడు ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్​ఎస్​‌లోని కొందరు ముఖ్య నేతల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రాధాకిషన్​ రావు వెల్లడించినట్టుగా ప్రచారం జరిగింది. ఆ స్టేట్​ మెంట్​‌లో పదిసార్లకు పైగా కేసీఆర్​ పేరు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఆయన దగ్గర ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్​ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు రాధాకిషన్ రావు చెప్పినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని కార్యాలయానికి పిలిపించారు. రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్​ చేయించారు? ఎవరు చెబితే చేశారు? ఇలా అనేక ప్రశ్నలు వేసినట్టు సమాచారం. కేసీఆర్​‌తోపాటు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నదని భావిస్తున్న బీఆర్​ఎస్‌లోని కీలక నేతల పేర్లను ప్రస్తావిస్తూ వాళ్లు చెబితే మీరు ఎస్​ఐబీ ద్వారా ఎవరివైనా ఫోన్లను ట్యాప్​ చేయించారా అని అడిగినట్టుగా తెలిసింది.

ప్రభాకర్ రావుతో లింకులపై ప్రశ్నలు

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలకుర్తి నియోజకవర్గంతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి కొద్దిదూరంలో ఫోన్ల ట్యాపింగ్​ కోసం ప్రత్యేక వార్​ రూంలు ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే వెల్లడైంది. ట్యాపింగ్​ కోసం విదేశాల నుంచి పరికరాలు కూడా తెప్పించినట్టుగా తేలింది. దీంట్లో మీ పాత్ర ఏంటి అని కూడా సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్న జాబితా మీ నుంచే అప్పటి ఎస్​ఐబీ ఛీఫ్ ప్రభాకర్ రావుకు వెళ్లిందా అని అడిగినట్టు తెలిసింది. అసలు, రిటైర్ అయిన ప్రభాకర్ రావును తిరిగి ఎస్​ఐబీ ఛీఫ్‌గా ఎలా నియమించారు? నిబంధనల ప్రకారమే ఇదంతా జరిగిందా? అని కూడా అడిగినట్టుగా తెలియవచ్చింది. అయితే, రాజశేఖర్ రెడ్డి చాలా ప్రశ్నలకు సమాధానాలు దాట వేసినట్టుగా తెలిసింది. ఫలానా వారి ఫోన్లను ట్యాప్​ చెయ్యాలని తాను ఎవరికీ చెప్పలేదు అన్నట్టుగా సమాచారం. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించిన వివరాలను ప్రస్తావిస్తూ ప్రశ్నించినా రాజశేఖర్ రెడ్డి పెదవి విప్పలేదని తెలియవచ్చింది. రెండు గంటలపాటు ప్రశ్నించి అతని స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్​ అధికారులు మళ్లీ పిలిస్తే విచారణకు రావాలని సూచించి పంపించి వేశారు.

Also Read: Manasantha Nuvve: ఉదయ్ కిరణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్ ఎప్పుడంటే?

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!