Bhatti Vikramarka: ఇప్పటివరకు వేలంలో పాల్గొనలేకపోవడం వల్ల సింగరేణి రెండు పెద్ద బొగ్గు బ్లాకులతో పాటు రూ.60 వేల కోట్ల రెవెన్యూ కోల్పోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) తెలిపారు. సింగరేణి వేలంపాటలో బ్లాకులు పొందాలని, అందుకు అనుమతించాలని కార్మిక సంఘాలు, సింగరేణి బోర్డు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయని, సింగరేణి సంస్థలో పనిచేసే 40,000 మంది కార్మికుల, 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్, సింగరేణి మనుగడ దృష్ట్యా ఇకపై వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొనాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. హైదరాబాద్(Hyderabad) లోని సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ప్రకటించారు. గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికి సొంతమై ఉండేవని, కానీ సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం ప్రారంభించిందన్నారు.
ప్రైవేట్ వ్యక్తులకు లాభం
అయితే పలు రకాల భ్రమలు, అపోహలు, భావోద్వేగాల కారణంగా సింగరేణిని ఈ వేలంపాటలో పాల్గొనకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి సంస్థ వేలంపాటలో పాల్గొనకుండా ఉన్నందువల్ల సింగరేణి గనుల పక్కనే ఉన్న రెండు పెద్ద బ్లాకులు సత్తుపల్లి, కోయగూడెం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, తద్వారా సింగరేణికి రూ.60 వేల కోట్ల రెవెన్యూను, రూ.15 వేల కోట్ల లాభాలను కోల్పోయిందని డిప్యూటీ సీఎం వివరించారు. ఇది చాలా ఘోర తప్పిదమని ఆయన పేర్కొన్నారు. వేలంలో సింగరేణి పాల్గొనకపోతే అది ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చుతుందని చెప్పారు. వేలంలో ప్రైవేట్(Private) వ్యక్తులకు బ్లాక్ లు దక్కినా రాష్ట్రానికి రాయల్టీ వస్తుందన్నారు. వేలంలో కేంద్రానికి వచ్చే ఆదాయం ఉండదని భట్టి స్పష్టంచేశారు. సింగరేణిలో ప్రస్తుతం 38 గనులు ఉన్నాయని, కానీ ఈ గనుల్లో బొగ్గు(Cole) నిల్వలు తరిగిపోతూ ఉండటం వల్ల మరో ఐదేళ్లలో 10 గనులు మూతపడనున్నాయని, తద్వారా 8 వేల మంది ఉద్యోగులు అవసరానికి మించి ఉంటారని భట్టి విక్రమార్క తెలిపారు. వారి ఉద్యోగ భద్రత కోసం కొత్త గనులు అవసరమన్నారు. ప్రస్తుతం సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోందని కొత్త బ్లాకులు రానట్లయితే ఈ ఉత్పత్తి సగానికి పైగా పడిపోయే ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read: RGV on Mirai movie: ‘మిరాయ్’ సినిమాపై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్.. ఏం అన్నాడంటే?
‘సింగరేణి గ్లోబల్ ’ పేరుతో అంతర్జాతీయంగా కీలక ఖనిజ రంగలోకి ప్రవేశం
నేడు దేశీయంగా కీలక ఖనిజాలకు ఎంతో డిమాండ్ ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి సంస్థ కూడా కీలక ఖనిజాల ఉత్పత్తి కోసం రంగం సిద్ధం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ కీలక ఖనిజాల ఉత్పత్తికి అవకాశం ఉందో పరిశీలించేందుకు సింగరేణి సంస్థ ఒక ఏజెన్సీని నియమించుకుందని, ఆ ఏజెన్సీ ఇచ్చే లాభదాయక సూచనలను పరిగణనలోకి తీసుకొని ‘సింగరేణి గ్లోబల్’ (‘Singareni Global’)పేరుతో ప్రపంచంలోని పలు దేశాల్లో కీలక ఖనిజాల ఉత్పత్తిని సింగరేణి సంస్థ ప్రారంభించనుందని భట్టి తెలిపారు.
కర్ణాటకలో బంగారం, రాగి అన్వేషణకు సింగరేణి
సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా ఇటీవల జరిగిన కీలక ఖనిజాల అన్వేషణకు వేలంలో కర్ణాటక(karnataka) రాయచూర్(Rayachur) లోని దేవదుర్గ్ ప్రాంతంలో బంగారం(Gold), రాగి అన్వేషణకు 37.75 శాతం రాయల్టీతో లైసెన్సు సాధించిందని, అన్వేషణ పనులు త్వరలో ప్రారంభించనుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అన్వేషణ తర్వాత ఆ ప్రాంతంలో ఎవరు ఆ గనులను చేపట్టినా గనుల పూర్తి కాలం వరకు 37.75 శాతం రాయల్టీ సింగరేణికి వస్తాయన్నారు. అనంతరం సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ గనులు, బొగ్గు ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్లను డిప్యూటీ సీఎంకు వివరించారు. సింగరేణి సంస్థలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన కార్మికులు, అధికారులు ఉన్నారని, అయితే బొగ్గు బ్లాకులు లేకపోవడం వల్ల ఇది సాధ్యం కావడంలేదని, ఇకపై వేలంపాటలో పాల్గొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపడం వల్ల కొత్త బ్లాకులను సింగరేణి సంస్థ చేపట్టడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు(MLA Vijaya Ramana Rao), సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Also Read: Hanamkonda District: ఆర్టీసీ బస్సు కోసం రోడ్డు ఎక్కిన ఊరు.. ఎక్కడంటే..?