Balaram Naik: గతంలో బొగ్గు బ్లాకుల వేలం పాటలో పాల్గొనకపోవడంతో కొత్త బ్లాకులను చేపట్టలేకపోయామని, త్వరలో జరగనున్న సుమారు 100కు పైగా బొగ్గు బ్లాకుల వేలం పాటలో పాల్గొని లాభసాటిగా ఉండే కనీసం 10 బొగ్గు బ్లాకులను కచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం ఉందని సీఎండీ ఎన్ బలరామ్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సంస్థగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకు కార్మిక సంఘాలు పూర్తి సహకారం అందించాలన్నారు. పని సంస్కృతి మెరుగుపడాలని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘం ప్రతినిధులతో 38వ సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read: Singareni Collieries: ఒడిశా నైనీ నుంచి తమిళనాడు జెన్ కోకు బొగ్గు.. 10 రోజుల్లో ఒప్పందం
గతానికి భిన్నంగా ఈసారి గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక, అధికార సంఘాలతో జరిగిన నిర్మాణాత్మక సమావేశాలు ప్రశాంతంగా , నిర్మాణాత్మక సూచనలతో, సలహాలతో హుందాగా జరిగాయని, కార్మిక సంఘాలు సూచించిన అన్ని సమస్యల పైన కూలంకషంగా చర్చించి సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు సూచించిన విధంగా మెడికల్ అటెండెన్స్ నిబంధనలను సరళతరం చేస్తామని, కార్మికులకు, అధికారులకు రావాల్సిన పదోన్నతుల్లో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఉద్యోగులకు, అధికారులకు ఛార్జీషీట్లు జారీ అయిన పక్షంలో నిర్ణీత వ్యవధిలో వాటిపై విచారణను పూర్తి చేసేలా చూస్తామన్నారు. అధికారులు గానీ, కార్మికులు గానీ షిఫ్ట్ లోని 8 గంటల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తేనే సంస్థకు మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు.
సింగరేణిని శూన్య ప్రమాద కంపెనీగా తీర్చిదిద్దాలి
ప్రమాదాలు జరిగినప్పుడే రక్షణపై చర్చించడం కాదు.. నిరంతంర రక్షణ నియమాలు పాటిస్తూ పనిచేయాలన్నారు. సింగరేణిని శూన్య ప్రమాద కంపెనీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. బొగ్గు మార్కెట్లో నిలబడటానికి, వినియోగదారులను మనతో ఉంచుకోవడానికి ఇటీవలనే బొగ్గు ధరను దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గించడం జరిగిందని, నాణ్యత పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కార్మిక సంఘాలు ఈ అంశాలపై కూడా దృష్టి సారించి తమ వంతుగా సహకరించాలని, కార్మికుల్ని చైతన్య పరచాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం బొగ్గు ఆధారిత కంపెనీగా మాత్రమే కాకుండా బహుళ వ్యాపార విస్తరణ చర్యలను సింగరేణి చేపడుతుందని వివరించారు. కీలక ఖనిజాలకు రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉండబోతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని కీలక ఖనిజ అన్వేషణ, ఉత్పత్తి కోసం ప్రముఖ జాతీయస్థాయి పరిశోధన సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు.
500 మెగావాట్ల పంప్డు స్టోరేజ్ ప్లాంటు
దేశంలోని 10 రాష్ట్రాల్లో సింగరేణి కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి ఐదు దేశాల్లో కీలక ఖనిజ రంగంలో పనిచేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే కార్బన్ డ యాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ విజయవంతమైందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగాల్లో కూడా అడుగుపెట్టనున్నామని , 500 మెగావాట్ల పంప్డు స్టోరేజ్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒడిశాలో 2400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటుతో థర్మల్ విద్యుత్ ద్వారా ఏటా గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.
రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం
సింగరేణి సంస్థ అమలు జరిపిన రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం నేడు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా అన్ని సంస్థల్లోనూ అమలు జరపాలని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. అధికారులకు సంబంధించిన పీఆర్పీ విషయంలోనూ త్వరలో సానుకూల నిర్ణయం రానుందని తెలిపారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్ లు సూచించిన పలు సమస్యలపై, సూచనలపై సీఎండీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రు, డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు, జీఎం(కో ఆర్డినేషన్)శ్రీనివాస్, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం కవితా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read:Singareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!
