తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : SC Sub Categories | రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ జస్టిస్ షమీమ్ అఖ్తర్ చేసిన సిఫారసులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన లేదా పట్టించుకోని షెడ్యూల్డు కులాలను మొదటి గ్రూపుగా పేర్కొని, 1% రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిఫారసు చేసింది. మొత్తం ఎస్సీ జనాభాలో 15 కులాలు, ఉప కులాలకు చెందిన వీరు 3.288%గా ఉన్నట్లు పేర్కొన్నది. మాదిగలతో పాటు మరో 18 కులాలను మధ్యస్థంగా లబ్ధిపొందినట్లుగా గుర్తించి రెండో గ్రూపులో చేర్చింది. మొత్తం ఎస్సీ జనాభాలో వీరు దాదాపు 62.748% గా ఉన్నారని, వీరికి 9% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇక మెరుగైన ప్రయోజనం పొందినట్లుగా భావించిన 26 కులాలను మూడో గ్రూపులో చేర్చి 5% రిజర్వేషన్ ఇవ్వొచ్చని సిఫారసు చేసింది. మొత్తం ఎస్సీ జనాభాలో వీరు 33.963%గా ఉన్నట్లు పేర్కొన్నది.
అసెంబ్లీకి అఖ్తర్ కమిషన్ నివేదిక
జస్టిస్ అఖ్తర్ కమిషన్ సమర్పించిన నివేదికను చర్చించిన మంత్రివర్గం.. కొన్ని సిఫారసులకు ఆమోదం తెలిపి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో (2011 జనాభా లెక్కల ప్రకారం) సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా చోటుచేసుకున్న వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకున్న కమిషన్.. 59 కులాలు, ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.
మొదటి గ్రూపులో 15 కులాలు ఉన్నప్పటికీ వీరు మొత్తం ఎస్సీ జనాభాలో 1,71,625 మంది (3.288%) మాత్రమే. అత్యధికంగా మాదిగలు 32,33,642 మంది ఉన్నట్లుగా తేల్చింది (ఎస్సీ జనాభాలో 61.967%). ఎస్సీ రిజర్వేషన్‌తో మెరుగైన ప్రయోజనం పొందారన్న నిర్ధారణకు వచ్చిన కమిషన్ మాలలతో పాటు మరో 25 కులాలను ఒక గ్రూపుగా పేర్కొన్నది. మొత్తం ఎస్సీ జనాభాలో మాలలు (మాల అయ్యవార్‌తో కలిపి) 15,27,143 మంది ఉన్నారని (మొత్తం ఎస్సీ జనాభాలో 29.265%) పేర్కొన్నది.
కమిషన్ సిఫారసుల ప్రకారం గ్రూపులవారీగా కులాలు (SC Sub Categories) :
గ్రూప్-1 :
బావురి, బేడా (బుడగ) జంగం, చచాటి, డక్కల్ (డక్కల్వార్), జగ్గలి, కొలుపులవాండ్లు (పంబాడ, పంబండ, పంబాలా), మాంగ్, మాంగ్ గరోడి, మన్నే, మష్తీ, మాతంగ, మెహతర్, ముండాల, సంబన్, సప్రు. మొత్తం ఎస్సీ జనాభాలో కేవలం 1.71 లక్షలుగా ఉన్న ఈ 15 కులాలకు చెందినవారికి మొత్తం 15% రిజర్వేషన్‌లో 1% దక్కనున్నది.
గ్రూప్-2 :
అరుంధతీయ, బైండ్ల, చమర్ (మోచి, ముచి, చమర్ రవిదాస్, చమర్-రోహిదాస్), చంబర్, చండాల, దండాసి, డోమ్ (డోంబ్రా, పైడి, పానో), ఎల్లమ్మాల్వార్ (ఎల్లమ్మవాండ్లు), గోడారి, జాంబవులు, మాదిగ, మాదిగదాసు, మష్తీన్, పామిడి, పంచమ, పరియ, సమగర, సింధోళ్ళు (చిందోళ్లు) యాటల, వల్లువన్. మొత్తం ఎస్సీ జనాభాలో వీరు 32.74 లక్షల మంది (62.748%). గ్రూప-2గా వీరికి 9% రిజర్వేషన్ కల్పించేలా కమిషన్ సిఫారసు చేసింది.
గ్రూప్-3 :
ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, ఆరె మాల, అర్వ మాల, బారికి, బ్యాగర (బ్యాగరి), చలవాడి, డోర్, ఘాసి (హడ్డి, రెల్లి, దాచండి), గోసంగి, హోలెయ, హోలెయ దాసరి, మాదాసి కురువ, మదారి కురువ, మహర్, మాల, మాల అయ్యవార్, మాలదాసు, మాల దాసరి, మాల హన్నాయ్, మాల మష్తీ, మాలసాలె, మాల సన్యాసి, నేతగాని, మిత అయ్యల్వార్, షాకీ, మోటీ, తోటి, రెల్లి.. మొత్తం 26 కులాలను గ్రూప్-3గా కమిషన్ పేర్కొన్నది. మొత్తం ఎస్సీ జనాభాలో వీరు 17.71 లక్షల మంది (33.963%). వీరికి 5% రిజర్వేషన్‌ను కల్పిస్తూ కమిషన్ సిఫారసు చేసింది.
ఎస్సీ కులాలకు రోస్టర్ పాయింట్లను కూడా కమిషన్ సిఫారసు చేసింది. గ్రూప్-1కు 7, గ్రూప్-2కు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 చొప్పున, గ్రూప్-3కు 22, 41, 62, 77, 91 చొప్పున సిఫారసు చేసింది. ఉద్యోగ ఖాళీలను క్రమబద్ధంగా, సమాన పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రిఫరెన్షియల్ మోడల్‌ను ప్రతిపాదించింది. గ్రూప్-1లో నోటిఫై చేసిన, భర్తీ చేయకుండా ఉన్న ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్ (అంటే గ్రూప్-2 ద్వారా) భర్తీ చేయాలని, గ్రూప్-2లో భర్తీ చేయని ఖాళీలను (అంటే, గ్రూప్-3 ద్వారా) భర్తీ చేయాలి. అన్ని గ్రూపులలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉండే ఈ పోస్టుల్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని సిఫారసు చేసింది.
క్రీమిలేయర్‌కు మంత్రివర్గం నో
ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించే ఈ మూడు సిఫారసులను మంత్రివర్గం ఆమోదించి అసెంబ్లీలో ప్రకటనగా ప్రవేశపెట్టింది. కానీ క్రీమిలేయర్ సిఫారసును మాత్రం మంత్రివర్గం తిరస్కరించింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్లు, మేయర్‌లు తదితర ప్రజా ప్రతినిధులతో పాటు గ్రూప్-1 సర్వీసుల్లో ఉన్నవారిని క్రీమి లేయర్‌గా పరిగణించాలని, వీరి రెండో తరం ఇకపైన రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందకుండా మినహాయించాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ అఖ్తర్ కమిషన్ సిఫారసు చేసింది. దీనిపై మంత్రులంతా చర్చించి సిఫారసును తిరస్కరించారు. చివరకు మూడు సిఫారసులను మాత్రమే క్యాబినెట్ ఆమోదించింది.
కమిషన్ అధ్యయనం ఇలా :
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 11న జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించింది. రెండు నెలల వ్యవధిలో నివేదికను అందించాలని నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో జనవరి 11న నెల రోజుల అదనపు గడువు ఇచ్చింది. ఆ ప్రకారం ఈ నెల 10న గడువు ముగియడానికి వారం రోజుల ముందే ప్రభుత్వానికి తుది నివేదికను కమిషన్ అందజేసింది. గతేడాది డిసెంబర్ 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించిన కమిషన్… అన్ని ఉమ్మడి జిల్లాలను సందర్శించి ప్రజల అభిప్రాయాలను తీసుకున్నది.
కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. మొత్తం 4,750 విజ్ఞప్తులను, కొన్ని అర్జీలను, మరికొన్ని మెయిల్ ప్రతిపాదనలను.. అన్నీ కలిపి 8,681 అభిప్రాయాలను పరిశీలించింది. వీటికి తోడు 59 కులాలు, ఉపకులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యం తదితర గణాంకాలను కూడా ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల నుంచి సేకరించింది. వివిధ సంస్థలు, సంఘాల వినతి పత్రాలు, విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ పరిశీలించి నివేదికను 82 రోజుల వ్యవధిలో తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది.