Sankranti Travel Rush: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ (Sankranti Travel Rush) ఆదివారం కూడా కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో నివాసముంటున్నవారు తమ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో, నగరంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికుల కిక్కిరిసిపోయాయి. బస్సులు అలా బస్‌స్టాండ్‌కు వచ్చిన వెంటనే నిండిపోతున్నాయి. సీట్ల కోసం జనాలు ఎగబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బస్సులు ఎక్కే దగ్గర తోపులాట వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు, ప్రయాణికులకు తగ్గ సంఖ్యలో బస్సులు లేకపోవడంతో జనాలు బస్‌స్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. కాగా, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్‌ఆర్టీసీ ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి 600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తీవ్రమైన వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరబాద్‌లో ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం వచ్చినవారంతా సంక్రాంతి పండుగ కోసం తమ సొంతూళ్లకు వెళుతున్నారు. చౌటుప్పల్, నార్కెట్‌పల్లి పరిపర ప్రాంతాలలో విపరీతమైన వాహనాల రద్దీ ఉంది. హైవే విస్తరణ కోసం రోడ్డు నిర్మాణ పనులు సైతం కొనసాగుతుండడంతో మార్గం ఇరుకుగా మారింది. దీంతో, వాహనాల చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలు గంటల తరబడి వాహనాల్లో చిక్కుకుపోతున్నారు. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాహనాలు కిలోమీటర్ల మేర రోడ్డు మీద నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. వాహనాలు ముందుకు కదలక నరకయాతన అనుభవిస్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో గత రెండు రోజుల నుంచి రోడ్లపై ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. అయితే, వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
Read Also- Medaram Jatara 2026: మేడారం జాతరపై ఆరోగ్య శాఖ స్పెషల్ ఫోకస్.. 30 మెడికల్ క్యాంపుల ఎర్పాటుతో పాటు..?
తెలంగాణలో 16 వరకు సెలవులు
తెలంగాణలో స్కూళ్లకు ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అంటే, ఆదివారం (జనవరి 11) నుంచి శుక్రవారం (జనవరి 16) వరకు వరుసగా 5 రోజులు హాలిడేస్ రావడంతో, ఆ తర్వాత శని, ఆదివారాలు కావడంతో జనాలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు బయలుదేరారు. ఇక, ఏపీలో సంక్రాంతి పండుగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉద్యోగ, ఉపాధి, చదువులు, ఇతర పనుల మీద ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారంతా తమ స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. ఈ ప్రభావం హైదరాబాద్ నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోగా, ఈ రెండు మూడు రోజుల్లో కూడా పెద్ద సంఖ్యలో తరలి వెళ్లనున్నారు.

