Municipal Politics: రాష్ట్రంలో మున్సిపల్ కో-ఆప్షన్ మెంబెర్స్‌కు డిమాండ్ పెరిగింది. పదవుల కోసం పోటీ తీవ్రమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ‘కో-ఆప్షన్’ సభ్యులుగా తమకు అవకాశం కల్పించాలని మంత్రులపై ప్రేజర్ పెరిగింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ ద్వితీయ శ్రేణి నాయకులు ఈ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ అనుచరులకు పదవులు ఇప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా వికలాంగులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారిలోనూ ఆశలు చిగురించాయి. సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు స్థానిక సంస్థల నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా పాలనలో మానవీయ కోణాన్ని తీసుకురావాలని సీఎం భావిస్తున్నారు.
మంత్రుల ఇళ్లకు లీడర్ల క్యూ
పదేళ్ల కాలంగా పార్టీ జెండా మోసి, ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ పదవులే లక్ష్యంగా నాయకులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ‘పదేళ్లుగా పార్టీ కోసం పనిచేశాం.. కనీసం ఇప్పుడైనా గుర్తించండి’ అంటూ తమ బయోడేటాలతో మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసి ఓడిపోయిన వారు, సీట్లు దక్కని వారు కూడా ఇప్పుడు కో-ఆప్షన్ వైపు చూస్తుండటంతో పోటీ విపరీతంగా పెరగడంతో పార్టీకి తలనొప్పి వచ్చిపడింది. వందల సంఖ్యలో రిక్వెస్టులు అందుతుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానం తలమునకలవుతోంది. ఎంపికలో కేవలం విధేయతకే కాకుండా, స్థానికంగా ఉన్న బలాబలాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
Also Read: IND vs NZ 2nd T20I: నేడే కివీస్‌తో రెండో టీ-20.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. కీలక ప్లేయర్ ఔట్?
నామినేట్ సభ్యుల సంఖ్య ఇలా..
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీ రాజ్ సంస్థలలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య మారుతూ ఉంటుంది. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం, ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య గరిష్టంగా ఆరుగురు ఉండగా, ఇందులో నలుగురు మైనార్టీలకు అవకాశం ఉంటుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో 2022 సవరణల ప్రకారం ఈ సంఖ్యను 15కు పెంచారు. ఇందులో ఆరుగురు మైనారిటీ సభ్యులు ఉంటారు. సాధారణ మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య నలుగురు ఉండగా, వీరిలో ఒకరు ఖచ్చితంగా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ అయి ఉండాలి. మరోవైపు, పంచాయతీ రాజ్ సంస్థల్లో భాగంగా జిల్లా పరిషత్‌లో మైనారిటీ వర్గాల నుంచి ఇద్దరు, మండల పరిషత్ నుంచి మైనారిటీ వర్గాల నుంచి ఒకరు కో-ఆప్షన్ సభ్యులుగా ఉంటారు. అయితే గ్రామ పంచాయతీలలో సాధారణంగా కో-ఆప్షన్ సభ్యులు ఉండరు, కేవలం ఎన్నికైన వార్డు సభ్యులు, సర్పంచ్ మాత్రమే ఉంటారు. ఈ కో-ఆప్షన్ సభ్యులకు కౌన్సిల్ లేదా పరిషత్ సమావేశాల్లో మాట్లాడే అధికారం ఉంటుంది కానీ, ఓటు వేసే హక్కు మాత్రం ఉండదని చట్టం స్పష్టం చేస్తోంది.
Also Read: UP Shocker: ఎంబీబీఎస్ సీటు కోసం.. కాలు నరుక్కున్న విద్యార్థి.. ఇదేం వెర్రితనం!

