Hyd Floods:
రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు
కంట్రోల్ రూమ్ నంబర్లు 040 2302813, 7416687878
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రకటన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు గురువారం ఆమె ప్రకటించారు. నగర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040 2302813 / 7416687878 లను ప్రజలు సంప్రదించవచ్చని సూచించారు. భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌కి కాల్ చేయవచ్చునని తెలిపారు. సంబంధిత అధికారులతో సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. నగర ప్రజలు కూడా వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని తహశీల్దార్లకు సెలవులు రద్దు చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, పోలీసులతో కలిసి పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Read Also- Putin India Visit: భారత్ వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలక పరిణామం
రోడ్లు జలమయం
హైదరాబాద్‌లో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యారు. భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ అవాంతరాల నుంచి బయటపడేందుకు మెట్రోలో ఇంటికి చేరుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, మెట్రో సర్వీసులు కొంత ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో సర్వీసులను పెంచాలని ప్రయాణికులు విజ్ఞప్తులు చేస్తున్నారు. కీలకమైన ఈ సమయంలో మెట్రో ట్రైన్ సర్వీసులు పెంచితే రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాగా, గంటల తరబడి మెట్రో స్టేషన్‌లలో నిరీక్షించి మరీ ప్రయాణికులు చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, కాబట్టి మెట్రో సర్వీస్ సమయంతో పాటుగా సర్వీస్‌ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. రాయదుర్గం, మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్‌తో పాటు పలు మెట్రో స్టేషన్లలో భారీగా ప్రయాణికులు వేచిచూస్తున్నారు. నగరంలో రోడ్లన్నీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యాయి.
Read Also- Bribe Case: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి.. ఎంతో తెలుసా?
పంజాగుట్ట వైపు వెళ్లొద్దు
పంజాగుట్ట రోడ్డు పూర్తిగా జామ్ అయింది. ఈ మార్గం గుండా వెళ్లకుండా నగర వాసులు ప్రత్యమ్నాయ మార్గాలను చూసుకోవడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లక్డీకపూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లవద్దని పేర్కొన్నారు. ఇక, బంజారాహిల్స్ నుంచి తాజ్ డెక్కన్, పంజాగుట్ట వైపు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. మరోవైపు, హైదరాబాద్ నగర శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వరద సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఆదేశించారు. రాత్రంతా వర్షం పడే సూచనలు ఉండడంతో ప్రజలెవరూ బయటకు రావొద్దని మంత్రి శ్రీధర్ బాబు అభ్యర్థించారు. నీళ్లు నిలిచే ప్రాంతాలను మ్యాపింగ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.