Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సంచలన సవాల్ విసిరారు. కేసీఆర్ (kcr), కిషన్ రెడ్డి (kishan reddy) తనతో చర్చలకు రావాలంటూ డిమాండ్ చేశారు. నారాయణ రావు పేటలో ఇందిరమ్మ ఇళ్లకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ‘గత పదేళ్ల కాలంలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసింది. గతంలో మాటలతోనే పబ్బం గడిపారు. కానీ మేం అలా కాదు’ అంటూ చెప్పుకొచ్చారు రేవంత్.
‘మా 14 నెలల పాలన బాగాలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలించింది. కేంద్రంలో బీజేపీ 12 ఏళ్లుగా ఉంటుంది. ఎవరి పాలన ఏంటో నిరూపించేందుకు కేసీఆర్, కిషన్ రెడ్డి నాతో చర్చకు రావాలి. ఒకవేళ చర్చలో నేను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా’ అంటూ సంచలన సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. తనపై కోపంతోనే పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టేశారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ద్వారా తరలించుకుని పోతుంటే కావాలనే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే కేసీఆర్ గట్టిగా ఫైట్ చేసి ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో తమకు గొడవ ఉండేది కాదని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలకు తెలంగాణ ఫలాలను తాకట్టుపెట్టారని.. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.