Journalists Health Cards: రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన మౌలిక సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రంగారెడ్డి జిల్లా శాఖ నేతృత్వంలో రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా బుధవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అంకితభావంతో పనిచేస్తున్న జర్నలిస్టులు… సామాజిక భద్రత, స్థిరమైన నివాసం వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని మంత్రికి వివరించారు.
హెల్త్ కార్డు అమలు అయ్యేలా చూడాలి
ముఖ్యంగా జిల్లాలో సరైన వైద్య సదుపాయాలు అందక పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నందున, వారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, నూతన అక్రిడేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాజేంద్రనగర్ రిపోర్టర్ నర్సింగ్ రావు గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అలాగే షాబాద్ మండలానికి చెందిన రిపోర్టర్ రాములు ఇటీవల గుండెపోటుతో మరణించారని ప్రస్తావించారు. ఉద్యోగుల మాదిరిగా అందరికీ హెల్త్ కార్డు అమలు అయ్యేలా చూడాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
Also Read: Houses to Journalists: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.. కలెక్టర్‌కు వినతి
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి
మరోవైపు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి సైదులు నేతృత్వంలో నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలి
దీనిపై స్పందించిన కలెక్టర్ నారాయణ రెడ్డి, అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. త్వరలోనే డీఈఓతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, రాయితీ ఇవ్వడానికి నిరాకరిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాయితీ నిరాకరించినట్లయితే, లిఖితపూర్వకంగా తమకు ఫిర్యాదు చేయాలని జర్నలిస్టులకు ఆయన సూచించారు. నూతన అక్రిడేషన్ కార్డుల జారీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా, త్వరలో జారీ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Also Read: Journalists Protest: ఎమ్మెల్యే బూతులు.. జర్నలిస్టుల ఆగ్రహం

