Rangareddy district: వివిధ వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బ్యాంకుల ద్వారా ఇతోధికంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలను అందజేస్తున్నది.
ప్రభుత్వ ఆర్థిక సాయంతో వివిధ యూనిట్లను ఏర్పాటుచేసుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజ్ ద్వారా లక్ష్యానికి మించి 112 శాతం రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. ఇందుకుగాను జిల్లా రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికైంది.
విరివిగా రుణాలు
జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 16వేల వరకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మహిళల ఆర్థిక అభివృద్దికి ప్రతి యేటా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్న జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందించి స్వావలంభనకు తోడ్పాటునందిస్తోంది. ప్రతియేటా రుణ ప్రగతిలో జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందుతుండడంతో అదే ఉత్సాహంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ విరివిగా రుణాలు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
Also read: Miyapur Phase 5: అక్రమార్కులకు అధికారుల సపోర్ట్.. లబోదిబోమంటున్న బాధితులు!
సభ్యుల ఆర్థిక అవసరాల మేరకు వ్యవసాయ, అనుబంధ రంగాలు, కిరాణ దుకాణాలు, పిండిగిర్నీ, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫుట్‌వేర్ తదితర వ్యాపారాలకు రుణాలను అందించారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలు ఆరు నెలలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి కూడా విరివిగా రుణాలను అందజేశారు. గతంలో రూ.50వేల నుంచి రూ.5లక్షల లోపుననే మహిళా సంఘాలకు రుణం ఇచ్చేవారు.
అయితే ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.20లక్షల వరకు అర్హతను బట్టి రుణాలను మంజూరు చేస్తూ వస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 15,571 సంఘాలకు రూ.959కోట్ల 18లక్షల రుణాలను అందజేశారు. రుణ లక్ష్యం రూ.850కోట్లకు మించి 112 శాతం రుణాలను అందించారు.
రుణాలు ఇవ్వడమే కాకుండా, సకాలంలో తిరిగి రుణాలు చెల్లించడం వంటి అంశాలపైననూ సంబంధిత అధికారులు మహిళలకు అవగాహన కల్పించి చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా సంఘాలు రుణాలను సకాలంలో చెల్లిస్తున్నాయి. దీంతో రుణాల రికవరీలోనూ జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉంది.
మంత్రి చేతుల మీదుగా అవార్డు ప్రదానం
అత్యధిక రుణాలను మహిళా సంఘాలకు అందజేసినందుకు రంగారెడ్డి జిల్లా.. రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. గురువారం తెలంగాణ ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా డిఆర్డీఏ పిడి శ్రీలత అవార్డును అందుకున్నారు.
Also read: Pallavi Prashanth: అఘోరీలా మారబోతున్న పల్లవి ప్రశాంత్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!