Rajalingamurthy: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యకేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్య కేసులో ఏ1 రేణికుంట్ల సంజీవ్ కాగా అతడికి సహకరించింది.. బీఆర్ఎస్ నేత, మాజీ మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్ కొత్త హరిబాబు అని పోలీసులు వివరించారు. భూ వివాదం కారణంగా రేణిగుంట్ల సంజీవ్ రాజలింగమూర్తిని హత్య చేయాలని భావించాడని.. అతడికి హరిబాబు సహకరించారని పోలీసులు తెలిపారు. ‘రాజలింగమూర్తిని చంపేయ్.. బెయిల్ ఖర్చులు, మిగతావి ఏమైనా ఉన్నా నేను చూసుకుంటా’ అంటూ హరిబాబు భరోసా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఆదివారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్యకేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఆదివారం మీడియాకు వెల్లడించారు. రాజలింగమూర్తి, రేణికుంట్ల సంజీవ్ కుటుంబానికి మధ్య భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పీఎస్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో తగాదా నడుస్తున్నదని ఎస్పీ తెలిపారు. ఈ అంశంపై భూపాలపల్లి జిల్లా వెల్లారు కోర్టు పరిధిలో విచారణ కూడా సాగుతున్నదని చెప్పారు. రాజలింగమూర్తి ఎకరం భూమి రాయించుకున్నాడని సంజీవ్ కక్ష పెంచుకున్నాడని ఎస్పీ తెలిపారు. దీంతో మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్ కొత్త హరిబాబు సహకారంతో హత్యకు ప్లాన్ చేశాడని ఎస్పీ తెలిపారు. హరిబాబుకు కూడా రాజలింగంతో గొడవలు ఉండటంతో ఈ హత్యకు సహకరించాడని వివరించారు. ‘రాజలింగమూర్తిని చంపేయ్.. బెయిల్ ఖర్చులు, మిగతావి ఏమైనా ఉన్నా నేను చూసుకుంటా’ అంటూ హరిబాబు భరోసా ఇచ్చాడని పోలీసులు తెలిపారు.
హత్యకు ఎలా ప్లాన్ చేశారు?
‘రాజలింగ మూర్తిని హత్య చేసేందుకు సంజీవ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్లాన్ చేశాడు. మోరే కుమార్ అనే వ్యక్తితో కలిసి కాశిబుగ్గ ప్రాంతంలో రెండు కత్తులు, ఒక రాడ్ కొనుగోలు చేశాడు. ఈ నెల 19న సంజీవ్ కోర్టులో పేషీ కోసం వెళ్లాడు. అదే రోజు రాజలింగమూర్తి అక్కడ కనిపించాడు. దీంతో హత్యచేయాలని సంజీవ్ ప్లాన్ చేశాడు. రాజలింగమూర్తి కదలికలు గమనించమని దాసరి కృష్ణ, నరేశ్ అనే వ్యక్తులకు సంజీవ్ సూచించాడు. అనంతరం సంజీవ్, కొత్తూరి కిరణ్, మోరే కుమార్, శ్రీమంత్ (బబ్లు) కత్తులు, రాడ్లు తీసుకొని రాజలింగమూర్తి వెళ్లే దారిలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో కాపుకాశారు. 19న సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో రాజలింగం అంబేద్కర్ సెంటర్ నుంచి తన ద్విచక్ర వాహనం మీద వస్తుండగా అతడికి ఇంటికి సమీపంలోని మూల మలుపు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బండికి అడ్డుకొని రాజలింగం కళ్లల్లో కారం చల్లారు. కత్తులు, ఇనుపరాడ్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. పొట్టభాగంలో కత్తితో పొడవగా రాజలింగమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు’ అని ఎస్పీ వివరించారు.
అరెస్ట్ చేసింది ఇక్కడే..
రాజలింగం భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ మొదలుపెట్టామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. నిందితులంతా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ చెక్ పోస్ట్ సమీపంలో కలుసుకున్నారన్న సమాచారంతో శనివారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేణికుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్ (బబ్లూ), మోరె కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసరి కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. హత్య చేసేందుకు ఉపయోగించిన 5 మోటార్ సైకిళ్లు, 7 మొబైల్స్, 2 కత్తులను, 1 ఇనుప రాడ్ సీజ్ చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులు కొత్త హరిబాబు, పుల్ల నరేశ్, పుల్ల సురేశ్ పరారీలో ఉన్నారని తెలిపారు.
దర్యాప్తుపై అనేక అనుమానాలు
రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి ఇంకా అనేక అనుమానాలు మిస్టరీగానే మిగిలిపోయాయని భూపాలజిల్లాలో చర్చ సాగుతున్నది. నిందితులకు భరోసా ఇచ్చింది మాజీ చైర్మన్ హరిబాబు ఒక్కడేనా? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. హరిబాబును అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు మూస పద్ధతిలోనే దర్యాప్తు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కాగా దర్యాప్తు జరిపి అసలు నిందితులను పట్టుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.