Rajalingamurthy
తెలంగాణ

Rajalingamurthy : రాజలింగమూర్తి హత్య కేసు లైట్ తీసుకున్నారా..?

సీఎం ఆరా తీసినా పట్టింపు లేదా?

6గుంటల భూవివాదానికే హత్య చేశారా?

హత్య వెనుక పెద్దోళ్ల హస్తం ఉందా?

రోజు వెలిగే వీధి దీపాలు ఆ రోజే ఎందుకు బంద్ అయ్యాయి?

సీసీ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు?

హత్య కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు

Rajalingamurthy : వరంగల్, స్వేచ్ఛః  సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలోనే పెను సంచలనం రేపింది. మాజీ సీఎం కేసీఆర్ పైనే పోరాడిన తెగువ రాజలింగమూర్తిది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై అందరికంటే ముందే కోర్టుల్లో కేసులు వేసింది రాజలింగం. అవతల ఉన్నది పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్. గులాబీ అధిపతి. మహామహులే కేసీఆర్ కు ఎదురెళ్లేందుకు భయపడుతుంటారు. అలాంటిది ఒక అతిసామాన్యుడైన రాజలింగం మాత్రం భయపడలేదు. ధైర్యంగా కేసీఆర్, హరీష్ రావులపై కేసులు వేసి ఉక్కిరి బిక్కిరి చేశాడు. అలాంటి రాజలింగమూర్తిని నడిరోడ్డుపై హత్య చేసినా.. లోకల్ గా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సామాజిక కార్యకర్తలు అంటేనే పోలీసులకు, రాజకీయ నాయకులకు గిట్టదు. వారు చేసే అక్రమాలు, అవినీతిని ఎండగడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతారని వారికి కోపం.

ఆ కోపమే ఇప్పుడు రాజలింగమూర్తికి శాపంగా మారినట్టు తెలుస్తోంది. ఒక సామాన్యుడైన రాజలింగమూర్తి కాళేశ్వరం అవినీతిపై ఏకంగా కేసీఆర్, హరీష్‌రావులపైనే కేసులు వేస్తే వీరంతా ఊరుకుంటారా.. ఇదే అదును అన్నట్టు రాజలింగమూర్తికి వ్యతిరేకంగా ఉన్న వారంతా ఏకమైనట్టు తెలుస్తోంది. సీఎం ఆరా తీస్తున్నా సరే.. తప్పుడు సమాచారం ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతని వ్యక్తిగత భూ సెటిల్మెంట్స్ కారణంగానే హత్య జరిగినట్టు కప్పిపుచ్చేందుకు అనేక మార్గాల్లో సీఎంవోకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని లోకల్ గా ప్రచారం జరుగుతోంది. రాజలింగం హత్యకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని లీడర్లకు ముందే సమాచారం ఉందని స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. లోకల్ పోలీసులు కాకుండా సీబీసీఐడీ, సిట్ పోలీసులు విచారిస్తే రాజలింగంపై పగ పెంచుకున్న పోలీసులు, నేతల బండారం బయటపడుతుందని రాజలింగం సన్నిహితులు అంటున్నారు. హత్య వెనక ఉన్నది ఎవరనేది ఛేదించకుండా.. హత్య వరకే పరిమితం చేసేలా కొంత మంది కుట్రలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

పక్క పథకం ప్రకారమే జరిగిందా..?

నిందితులకు, రాజలింగమూర్తికి 15 ఏళ్ల పరిచయం ఉంది. ఆ భూమిని మాజీ సర్పంచ్ చెర నుంచి కాపాడి నిందితులకు ఇప్పించింది రాజలింగమూర్తియే. అందుకు బదులుగా 6 గుంటల భూమిని రాజలింగానికి ఇచ్చారు. అయితే ఆ భూమి రోడ్డు పక్కన కాకుండా లోపలి సైడ్ ఇస్తామనడంతో గొడవ స్టార్ట్ అయింది. అసలే రాదనుకున్న భూమిని కోర్టు ద్వారా ఫైట్ చేసి ఇప్పించిన మూర్తి, ఆ కుటుంబానికి ప్రేమ ఉంది. కానీ అటు పోలీసులకు, ఇటు రాజకీయ నాయకులకు సంబంధించిన అన్ని విషయాల్లో వేలు పెట్టడంతో పాటు కాళేశ్వరం కేసు రాజలింగం హత్యకు కుట్రలు చేసేదాకా తీసుకెళ్లాయని వినికిడి. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు రాగా.. కేసీఆర్ తరుపు న్యాయవాది వాదిస్తూ పిటిషనర్ చనిపోయారు కాబట్టి కేసు క్లోజ్ చేయండి అని కోర్టు ముందు ఉంచారు. వార్తలో విన్నానన్న జస్టిస్ , ప్రభుత్వం వివరణ అడిగారు. వివిధ కేసుల్లో పిటిషనర్ చనిపోయినా కేసు విచారణ జరగిందని చెప్పడంతో సోమవారానికి వాయిదా వేశారు. దీంతో పాటు స్పాట్ లో పోలీసులు, వీధిలైట్స్ రాకపోవడం, సీసీ కెమెరాల్లో నిందితుల విజువల్స్ ఇప్పటికీ బయటకు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

స్థానిక పోలీసుల నిర్లక్ష్యం..

భూపాలపల్లి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి 60 గజాల దూరంలో హత్యకు గురయ్యాడు రాజలింగమూర్తి. అక్కడ రోజూ వెలిగే వీధి లైట్స్ రాత్రి 10 గంటల వరకు పనిచేయలేదు. బ్లైండ్ స్పాట్ గా ఉన్న ఆ ఏరియాని నిందితులు ఎంచుకున్నారు. రెండు బైక్ ల పై వచ్చిన నలుగురు వ్యక్తుల్లో.. ఇద్దరు అడ్డుకోగా, మిగతా ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా రెండు మూడు పోట్లకు చనిపోయేలా పొడిచారు. మెడపై మొదటదాడి చేశారు. ఆ తర్వాత కడుపులోని పేగులు బయటకు వచ్చేలా పొడిచారు. మృతుడు అడ్డుకోవడానికి వీలు లేకుండా వేరే ప్రాంతంలో కత్తిపోట్లు లేకుండా ప్రొపెషనల్ క్రిమినల్స్ లా చంపేశారు. ఈ హత్య జరిగిన దారిపొడగునా ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు లొంగిపోయి మేమే చేశామని అంటున్నారు. మరో ఇద్దరినీ ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీఎం ఆరా తీస్తున్నా సరే… కనీసం సీసీ ఫుటేజీ కూడా బయటకు ఇవ్వకుండా, ప్రచారం లేకుండా సైలెంట్ గా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు వాడిన కత్తి కూడా ఓ మీడియా ప్రతినిధి చూపిస్తే స్వాధీనం చేసుకునేంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని రాజలింగం కుటుంబ సభ్యులు విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజాలు బయటకు వస్తాయా..?

నేడో , రేపో అధికారికంగా పోలీసుల ప్రెస్ మీట్ ఉంటుందని అంటున్నారు. హత్య చేసిన నలుగురే నిందితులుగా ఉంటారా..? కాపుకాసిన వారి దగ్గర నుంచి కుట్రలు చేసిన వారి దాకా.. అందరి పేర్లు బయట పెడుతారా అన్నది తెలియదు. కాల్ డేటా, లొకేషన్స్, సీసీ ఫుటేజీతో అధారాలు కూడా ఇస్తారా అనేది స్థానికంగా ప్రశ్నార్ధకంగా మారింది. ఎదురిస్తే అందరూ ఏకమై ఇలా చేస్తారా..? మూడో రోజు తర్వాత చర్చలేకుండా చేస్తారా..? అనే అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం