Rajalingamurthy
తెలంగాణ

Rajalingamurthy Murder | కాళేశ్వరం అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా..?

రాజలింగం హత్య వెనక ఎన్నో అనుమానాలు
ఇది ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ ప‌నే
నేడు కోర్టులో విచార‌ణ‌కు కేసు
ముందురోజే దారుణ హ‌త్య‌
కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ
కుంగుబాటుపై న్యాయపోరాటం
భూపాల‌ప‌ల్లి జీపీ వ్యవహారంతో కేసు కొట్టివేత
హైకోర్టుకు వెళ్లిన‌ రాజలింగం
ఆర్నెళ్ల‌ క్రితం ఆయ‌న లాయ‌ర్‌ ఆక‌స్మిక మృతి
కింది కోర్టు జీపీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక
ఈ కేసులో కేసీఆర్, హరీశ్‌, మేఘా కృష్ణారెడ్డితోపాటు ఐఏఎస్‌ల‌కు నోటీసులు
ఇంకా హైకోర్టులో కొనసాగుతున్న కాళేశ్వరం అవినీతి కేసు
ఈ కేసులో ఇద్దరు చనిపోవడంతో అనేక డౌట్స్
కాళేశ్వరంపై కేసు వేసిన న్యాయవాది, పిటిషన‌ర్‌ మరణాలపై స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Rajalingamurthy Murder: కాళేశ్వరం ప్రాజెక్టులో (kaleshwaram) అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడానికి కార‌ణ‌మంటూ ఆనాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (kcr), అప్ప‌టి మంత్రి హరీశ్‌రావు(harish rao) తోపాటు నిర్మాణ సంస్థ అధిప‌తి అయిన మేఘా కృష్ణారెడ్డిపై (megha krishnareddy) కేసు వేసిన సామాజిక కార్య‌క‌ర్త నాగవల్లి రాజ‌లింగ‌మూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి నలుగురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణార‌హితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. నెత్తుటిమ‌డుగులో ఉన్న‌ రాజ‌లింగ‌మూర్తిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన నాగవల్లి రాజ‌లింగ‌మూర్తి.. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయంత్రం భూపాలపల్లి సెంటర్‌కు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా మంకీ క్యాప్ ధరించి కాపు కాసి ఉన్న నలుగురు దుండగులు ఆయ‌న‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి ఉన్న రాజ‌లింగ‌మూర్తిని ఆటోలో స్థానిక ప్రభుత్వ 100 పడ‌కల ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.

ఆర్నెళ్ల క్రిత‌మే న్యాయ‌వాది సంజీవ‌రెడ్డి ఆక‌స్మిక మృతి

మేడిగడ్డ స్థానిక కోర్టు అయిన‌ భూపాలపల్లిలో కేసు వేసి నోటీసులు పంపించిన న్యాయవాది సంజీవరెడ్డి ఆరు నెలల క్రితం గుండెపోటుతో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న స‌మ‌యంలో మృతి చెందారు. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజే ఆయ‌న చ‌నిపోవ‌డం వెనుక అనుమానాలు త‌లెత్తాయి. సంజీవ‌రెడ్డి పిల్ల‌లు అమెరికాలో సెటిల్ అయినా.. ఆయ‌న మాత్రం త‌న భార్య‌తో క‌లిసి హ‌న్మకొండ అడ్వ‌కేట్స్ కాల‌నీలో నివాసం ఉండేవారు. గతంలో ఆయన జీపీగా పనిచేశారు. హార్ట్ఎటాక్‌తోనే చ‌నిపోయార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ రాజలింగమూర్తి తాజాగా అత్యంత దారుణంగా హత్యకు గురవడంతో రెండు కేసుల‌లోనూ అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, భూపాలపల్లిలో జరిగే ప్రభుత్వ భూ కబ్జాలపై రాజ‌లింగ‌మూర్తి పెద్ద ఎత్తున‌ న్యాయపోరాటం చేశారు. లక్ష కోట్ల వ్య‌యం అయిన‌ట్టు చెబుతున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి హైకోర్టులో ఇంకా విచార‌ణ జ‌రుగుతూనే ఉన్న‌ది. ప్రొఫెసర్ కోదండరాం, కేఏ పాల్, బక్క జడ్సన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతోపాటు రాజలింగమూర్తి ఇతరులు వేసిన పిటిషన్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

జీపీ వ్యవహారంతో కుట్రలు బ‌య‌ట‌కు?

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వింత వాదనలతోనే అసలు కుట్రలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆనాటి ముఖ్యమంత్రి (కేసీఆర్‌) ఎంతో గొప్పవాడని, పిటిషనర్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయని జీపీ వాదనలు చేశారు. దీంతో అదే కేసు ఉత్తర్వులో జడ్జి పేర్కొన్నారు. దీన్ని హైకోర్టులో రాజలింగం సవాలు చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తర‌ఫు న్యాయవాది ఆ జీపీ వాదనలను గుర్తించి, ఏజీకి సమాచారం అందజేయడంతో ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేసినట్లు సమాచారం. దీంతో కేసు ఎంత దూరమైనా వెళ్లొచ్చని విషయం మొత్తం తెలిసిన అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటుతో చ‌నిపోయారు. ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇప్పుడు పిటిషనర్ రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మరకల‌ను దాచిపెట్టేందుకు రక్తపుటేరులు పారేలా ప్లాన్ చేసింది ఎవ్వరనేది సిట్‌తో విచార‌ణ‌జరపాల్సిన అవసరం ఉంది. ఈ హత్యలకు అరోగ్యం, పర్సనల్ ఇష్యూలు, కక్షలు అనుకొని క్లోజ్ చేయడానికి వీలు లేదని ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు.

లింగమూర్తి పోరాడిన తీరు ఇది..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి రాజలింగమూర్తి ఫిర్యాదు చేశాడు.
2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ ఏడవ బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోయాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
– ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో భూపాలపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ (నెం. 174/2023) కింద కేసు నమోదు చేశారు.
– ఆ సమయంలోనే అసాంఘిక శక్తులు విధ్వంసానికి కుట్ర పన్నారని అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అనుమానాలు వ్యక్తం చేశారు.
– కేసీఆర్, హరీష్​ రావు వ్యాఖ్యలతో అసిస్టెంట్ ఇంజినీర్ దర్యాప్తు చేసి అలాంటి కుట్ర జరగలేదని వెల్లడించారు.
– ఇంజినీర్ దర్యాప్తు ఆధారంగా 2023 అక్టోబరు 22న ఎఫ్ఐఆర్‌ను పోలీసులు క్లోజ్ చేశారు.
– ఆ వెంటనే బ్యారేజీలోని నీటిని ఇంజినీర్లు దిగువకు విడుదల చేశారు.
– ఎఫ్ఐఆర్‌ను క్లోజ్ చేయడంపై రాజలింగమూర్తి అనుమానాలు వ్యక్తం చేస్తూ డీజీపీ, భూపాలపల్లి జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు అక్టోబరు 25న ఫిర్యాదు చేశాడు.
– అదే రోజున (2023 అక్టోబరు 25న) భూపాలపల్లి పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు చేసిన ఫిర్యాదులో కేసీఆర్, హరీశ్‌రావులను బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరాడు రాజలింగమూర్తి.
– పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో రాజలింగమూర్తి భూపాలపల్లి స్థానిక కోర్టును ఆశ్రయించాడు.
– దాంతో అలెర్ట్ అయిన పోలీసులు 2023 అక్టోబరు 24 నుంచి ప్రజలెవ్వరూ ఏడో బ్లాక్ దగ్గరకు వెళ్ళకుండా ఆంక్షలు విధించారు.
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మరికొందరికి మాత్రమే సందర్శించేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.
– 2023 నవంబరు 1వ తేదీన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు, అధికారులు ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించారు.
– సుమారు రూ.1.35 లక్షల కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటులో కేసీఆర్, హరీశ్‌రావు నిర్లక్ష్యం ఉందని రాజలింగమూర్తి ఆరోపించారు. వారిద్దరిపై ఐపీసీలోని 120-మి, 420, 386, 406, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశాడు లింగమూర్తి.
– కేసీఆర్, హరీశ్‌రావు, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ సెక్రెటరీ స్మితా సభర్వాల్, కాళేశ్వరం ఇంజినీర్–ఇన్– చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ ఎన్.శ్రీధర్, నిర్మాణ సంస్థ మేఘా ఎండీ కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ పి. సురేశ్ కుమార్ తదితరుల పేర్లను కూడా పిటిషన్‌లో నిందితులుగా చేర్చాలని కోరాడు.
– ఆ తర్వాత 2024 జనవరి 12న భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రివిజన్ పిటిషన్ (ఎస్ ఆర్ నెం. 2165/2023) వేశాడు.
– ఆర్డర్ కాపీని అందజేయలేదని ఫిర్యాదు చేస్తూ కోర్టులో 2024 ఫిబ్రవరి 27న అప్లికేషన్ కూడా దాఖలు చేశాడు.
– ఈ అప్లికేషన్‌తో 2024 ఫిబ్రవరి 28న కోర్టు ఆర్డర్ కాపీ రాజలింగమూర్తికి అందింది.

– కోర్టు పేరును సరిగ్గా పేర్కొనకపోవడంతో 2024 మార్చి 2న మరో అప్లికేషన్ దాఖలు చేశాడు రాజలింగమూర్తి.
– అనంతరం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 399 ప్రకారం క్రిమినల్ రివిజన్ పిటిషన్ (నెం. 2/2024)ను కూడా దాఖలు చేశాడు.
– ఈ పిటిషన్‌ (క్రిమినల్ ఎంపీ నెం. 53/2024) ను విచారణకు స్వీకరించి 2024 జూలై 10న భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
– ఈ పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు.. 2024 సెప్టెంబరు 5న విచారణకు హాజరుకావాల్సిందిగా కేసీఆర్, హరీశ్‌రావు, మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసింది.
– ఈ నోటీసులను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు 2024 డిసెంబరు 23న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
– హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ 2024 డిసెంబరు 24న విచారించి 2025 జనవరి 7వ తేదీలోగా తగిన కారణాలను చూపించాలని రాజలింగమూర్తికి నోటీసు జారీ చేసింది. తగిన గ్రౌండ్స్ లేవంటూ కేసీఆర్, హరీశ్‌రావు బీఎన్ఎస్‌లోని సెక్షన్ 528 ప్రకారం పిటిషన్‌ దాఖలు చేశారు. క్రిమినల్ పిటిషన్‌ను ఎందుకు కొట్టివేయకూడదో వివరణ ఇవ్వాలని రాజలింగమూర్తికి నోటీసు జారీ చేసింది కోర్టు.
– రాజలింగమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు 2024 డిసెంబరు 24న జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
– కే.రవి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలతో పాటు సీహెచ్ రఘునందన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో పేర్కొన్న అంశాల మేరకు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు క్రిమినల్ ఎంపీ నెం. 53/2024, క్రిమినల్ ఆర్‌పీ (రివిజన్ పిటిషన్) నెం. 138/2024లపై ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది.
– రాజలింగమూర్తికి జారీచేసిన షోకాజ్ నోటీసుకు ఆయన నుంచి వివరణ వచ్చేంత వరకు (2025 జనవరి 7 వరకు) భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు ఇచ్చిన (2024 జూలై 10 నాటి ఉత్తర్వులు) ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు వెల్లడించింది.
– కౌంటర్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 20 వరకు రాజలింగమూర్తి గడువు కోరారు. దీనికి అంగీకరించిన హైకోర్టు ఫిబ్రవరి 20న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

భూపాలపల్లి కోర్టులో జరిగింది ఇదే ?

బీఆర్ఎస్ మళ్లీ అధికారం రాకపోవడానికి ప్రధాన కారణాల్లో మేడిగడ్డ కుంగుబాటు ఒక‌టి. అవినీతితో పాటు అక్రమ నిర్ణయాల వ‌ల్లేన‌ని, దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేయాల‌ని అంటూ ఆనాడు రాజ‌లింగ‌మూర్తి, అడ్వొకేట్ సంజీవ‌రెడ్డి భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు, మేఘా కృష్ణారెడ్డి, ప‌లువురు ఐఏఎస్‌ల‌పై కేసు నమోదైంది. భూపాలపల్లి ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్ మేజిస్ట్రేట్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 5న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చింది. దీనితోపాటు ఈ అవినీతికి బాధ్యులను గుర్తించాక వారిని విచారించాలని కోరుతూ జిల్లా అదనపు ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్ మేజిస్ట్రేట్‌ కోర్టులో కూడా రాజ‌లింగ‌మూర్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌, హరీశ్‌రావు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను కూడా విచారించాలని కోరారు. అయితే.. అప్పట్లో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిని రాజలింగమూర్తి హైకోర్టులో సవాలు చేశారు. జిల్లా కోర్టులోనే రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించడంతో తిరిగి పిటిషన్‌ వేశారు. దీనిని స్వీకరించిన కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోవడానికి ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన కారకులని, రూ.లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయాయని పిటిష‌న‌ర్‌గా రాజ‌లింగ‌మూర్తి పేర్కొన్నారు. బ్యారేజ్‌ నిర్మాణం సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని, నాసిరకం పనులతో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, కేంద్ర విచారణ సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన‌ట్టు ఆయ‌న చెప్పేవారు. కేసీఆర్ అక్రమ సంపద వ్యవహారం, కాళేశ్వరం కహానీ ఫైల్స్ సీబీఐ దర్యాప్తుతోనే బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఎన్నోసార్లు తెలిపారు. కేసీఆర్‌తో పాటు హరీశ్‌, నాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, అప్పటి చీఫ్ ఇంజినీర్లు మురళీధర్ రావు, హరిరామ్‌, శ్రీధర్‌, నిర్మాణ సంస్థల బాధ్యులు ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌కుమార్‌, మేఘా సంస్థకు చెందిన యజమాని కృష్ణారెడ్డిని విచారించాలంటూ పిటిషనర్‌ కోరగా.. సెప్టెంబర్‌ 5న వీరంతా హాజరు కావాలంటూ ఆనాడు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ముందు రోజే హత్య

జిల్లా కోర్టుకు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణను నిలుపుదల చేస్తూ కొంతకాలం మధ్యంతర స్టే ఉత్తర్వులు హైకోర్టు నుంచి జారీ అయ్యాయి. దీన్ని మరికొంతకాలం పొడిగించాలని వారిద్దరూ హైకోర్టును కోరారు. దీన్ని పరిశీలిస్తామని పేర్కొన్న హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ తదుపరి విచారణను ఫిబ్రవరి 20కు వాయిదా వేశారు. కేసీఆర్, హరీశ్‌రావు కోరినట్లుగా నోటీసులను రద్దు చేయడం, విచారణపై విధించిన స్టే ఉత్తర్వులను మరికొంత కాలం పొడిగించడంపై ఫిబ్రవరి 20న నిర్ణయం తీసుకోనున్నట్లు జస్టిస్ లక్ష్మణ్ గత విచారణలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం విచారణకు రావడానికి కొన్ని గంటల ముందే రాజలింగమూర్తి హత్యకు గురికావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు