Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి భగ భగలతో అడుగు తీసి బయట పెట్టలేకపోతున్నారు. ఎండవేడిమి కారణంగా పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నారు. సమ్మర్ అయిపోయేంత వరకూ ఈ వడగాల్పులను భరించాల్సిందేనా అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఆ జిల్లాల్లో వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ (మార్చి 21), రేపు (మార్చి 22) తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుండగా రానున్న 3 రోజుల్లో వాటిలో తగ్గుదల కనిపిస్తుందని వాతావరణ శాఖ సూచించింది.
రైతులు ఇబ్బందులు
నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో గురువారం రాత్రి కురిసిన మోస్తరు వర్షానికి రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న పంట చేతికొచ్చిన ఈ సమయంలో వర్షం పడటంతో తీవ్ర అవస్థలకు గురయ్యారు. వర్షం నుంచి మెుక్కజొన్న పంటను కాపాడుకోవడానికి నానా పాట్లు పడ్డారు. పారీలు కప్పి పంటను రక్షించుకొని తెగ అగచాట్లు పడ్డారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంటను ఎలా కాపాడుకోవాలోనని తెగ ఆందోళన చెందుతున్నారు.
Also Read: CM Revanth Reddy: ఇది రేవంత్ సర్కార్.. ప్రతీ నిర్ణయం ఓ సంచలనమే!
ఏపీలోనూ వర్షాలు
ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు సైతం వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.
ఎండలు బాబోయ్
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 పైగా డిగ్రీల ఎండ నమోదవుతుంది. దీంతో మధ్యాహ్ననికే రోడ్లన్ని వాహనాలు లేక వెలవెలబోతున్నాయి. అటు బస్సుల్లోనూ ప్రయాణికుల తాకిడి తగ్గిపోతుంది. పగటి పూట ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలావరకూ బస్టాండ్ లు పగటి వేళ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.