Clinical Establishment Act Violation: రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ జిల్లాల్లోని ప్రైవేట్ దవాఖానలు క్లినికల్ ఎస్లాబ్లిష్‌మెంట్ యాక్ట్ (Clinical Establishment Act) ను ఉల్లంఘిస్తున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడప్పుడు మొక్కుబడిగా నిర్వహించే డీఎంహెచ్‌వోల తనిఖీల్లో నకిలీ క్లినిక్‌లు, వైద్యులు దొరికినా చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నది. డాక్టర్ రిజిస్ట్రేషన్ లేకుండానే హాస్పిటల్ (Hospital), క్లినిక్ (Clinic) నిర్వహిస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రైవేట్ క్లినిక్‌లలో ఏకంగా సర్కార్ వైద్యులే ట్రీట్మెంట్ చేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాంగాలు మౌనంగా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ముడుపులు చెల్లించడంతోనే ఇలాంటి పరిస్థితి ఉన్నదంటూ వైద్యశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానలు, క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి నియంత్రణకు ఆరోగ్య శాఖ వద్ద ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకపోవడంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తున్నది. అధికారుల మానిటరింగ్ లేకపోవడంతోనే ఈ సమస్య అంటూ మెడికల్ ఎంప్లాయీస్ చర్చించుకుంటున్నారు.
సూర్యాపేటలోని ఆ దవాఖానలో దారుణం..?
ఇటీవల సూర్యాపేట పట్టణంలోని 105 ప్రైవేట్ దవాఖానల పరిస్థితిపై మెడికల్ కౌన్సిల్ (Medical Council) స్టడీ చేసింది. దాదాపు 57 కు పైగా ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇందులో గవర్నమెంట్ సర్వీస్ డాక్టర్స్ పనిచేస్తున్న క్లినిక్‌లు 35 వరకు ఉండటం గమనార్హం. ఉదాహరణకు సూర్యాపేట మెడికల్ కాలేజీకి చెందిన ఓ ప్రభుత్వ డాక్టర్.. ప్రైవేట్ ప్రాక్టీస్‌కు పెద్దపీట వేస్తారనే చర్చ అధికారుల్లోనే ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగం కలిగిన సదరు డాక్టర్.. అదే పట్టణంలోని కమల అనే హాస్పిటల్‌లో ప్రభుత్వంతో పోల్చితే దాదాపు మూడు రెట్లు అధిక జీతం పొందుతూ పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ హాస్పిటల్ యాజమాన్యంపై కూడా నిత్యం వివాదాలు, విమర్శలు ఉన్నాయి. ఆ మేనేజ్‌మెంట్‌కు ఈ ప్రభుత్వ డాక్టర్ నిత్యం అండగా ఉంటాడని అదే ఆసుపత్రి స్టాఫ్ చెప్పడం విశేషం. మేనేజ్‌మెంట్ సలహాలు, సూచనలతో అవసరం లేకపోయినా.. టెస్టులు, మందులు రాస్తారనే అభియోగాలు ఉన్నాయి. ఇక ఆ ఆసుపత్రి యాజమాన్యంపై గతంలో పీడీఎస్ అక్రమ రవాణాతో పాటు డ్రగ్స్(గంజాయి), రెమ్ డెసివీర్ ఇంజెక్షన్ల బ్లాక్ దందాలు చేసినట్లు గతంలో పోలీస్ ఉన్నతాధికారులే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఈ ఆసుపత్రి, డాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నో ప్రాక్టిస్.. ఓన్లీ సర్టిఫికేట్..?
కొంత మంది డాక్టర్లు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డ్యూటీలు చేయనప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా తమ సర్టిఫికెట్లు ఇచ్చి ఆయా ఆస్పత్రులకు అనుమతులు వచ్చేలా చొరవ తీసుకుంటున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అల్లోపతి హాస్పిటల్‌లో పనిచేయాలనుకుంటే ప్రైవేట్ క్వాలిఫైడ్ డాక్టర్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో పాటు అంగీకారం అవసరం. హాస్పిటల్ అనుమతి కోసం సర్టిఫికేట్ ఇచ్చిన సంబంధిత డాక్టర్లు ఆయా ఆసుపత్రుల్లో ప్రాక్టిస్ లేకపోయినా, గవర్నమెంట్ సర్వీస్ వ్యక్తి ఆయా ఆసుపత్రిలో సర్వీస్ చేసినా రూల్స్ ఉల్లంఘించినట్లేనని మెడికల్ కౌన్సిల్ అధికారులు చెప్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్ సర్వీస్ రూల్స్ జీవో 119 ప్రకారం సదరు డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్మిషన్స్, ఆపరేషన్స్ నిర్వహించకూడదు. కన్సల్టేషన్ మాత్రమే చేయాలి. గవర్నమెంట్ డాక్టర్ పేరిట ఏ హాస్పిటల్ స్థాపించకూడదు. బెడ్స్ ఉంటే హాస్పిటల్ పర్మిషన్ కోసం సదరు డాక్టర్‌కు సర్టిఫికెట్ కూడా ఇవ్వకూడదు.