Electricity Shortage: రాష్ట్రంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. దాదాపు నెల రోజులకు పైగా విద్యుత్ మీటర్ల కొరత తీవ్రంగా ఉండటంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఎంత డిమాండ్ ఉన్నా.. విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటిస్తున్నా కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన మీటర్లు అందుబాటులో లేకపోవడం విద్యుత్ సంస్థల పనితీరుపై విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో కొత్త కనెక్షన్ కావాలనుకున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, గచ్చిబౌలి, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ కొరత పెద్ద అడ్డంకిగా మారింది. కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, విల్లాలు విద్యుత్ కనెక్షన్ లేక గృహ ప్రవేశాలకు నోచుకోవడం లేదు. కన్ స్ట్రక్షన్ పనులు పూర్తయినప్పటికీ, విద్యుత్ మీటర్లు రాకపోవడంతో ఫినిషింగ్ పనులు పెండింగ్‌లో పడిపోయాయి. డిపాజిట్లు చెల్లించి నెలలు గడుస్తున్నా కార్యాలయాల చుట్టూ తిరగడం మినహా ఫలితం ఉండటం లేదని భవన యజమానులు వాపోతున్నారు.
స్టాక్ లేకపోవడంతో చేతులెత్తేస్తున్న సిబ్బంది
ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగంగా అందిస్తామని చెబుతున్న తరుణంలో ఈ మీటర్ల కొరత పాలనపై ప్రభావం చూపుతున్నది. విద్యుత్ సంస్థల వద్ద స్టాక్ లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న అధికారులు, కనీసం మీటర్లను కూడా సరఫరా చేయలేకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, మీటర్ల కొరతను తీర్చి కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాపై గొప్పగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, కనీస అవసరమైన మీటర్లను సరఫరా చేయలేకపోవడం శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నది. క్షేత్రస్థాయిలో పెండింగ్ ఫైళ్లు పేరుకుపోతుండటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Electricity Shortage: ఆ గ్రామాల్లో విద్యుత్ కొరతతో.. అల్లాడుతున్న ప్రజలు.. పట్టించుకోని అధికారులు
9 వేలకు పైగా మీటర్లు పెండింగ్‌లో
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గృహ, వాణిజ్య అవసరాల కోసం కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు జారీ చేయడంలో గణనీయమైన జాప్యం జరుగుతున్నదని గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరి 1 నుండి జనవరి 21 మధ్య అందిన దరఖాస్తులతో పాటు, గతంలో పెండింగ్‌లో ఉన్న వాటిని కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా మీటర్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇందులో కేటగిరీ 1 డొమెస్టిక్ విభాగానికి సంబంధించి దాదాపు 4 వేలకు పైగా పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక కేటగిరీ 2 నాన్ డొమెస్టిక్‌కు సంబంధించి 5 వేలకు పైగా మీటర్లు కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని సమాచారం. ప్రధానంగా సంగారెడ్డి, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, సైబర్ సిటీ, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో డొమెస్టిక్ విభాగంలో అత్యధికంగా కొత్త కనెక్షన్లు పెండింగ్‌లో పడినట్లు తెలుస్తున్నది. ఇక నాన్ డొమెస్టిక్ విభాగంలో రాజేంద్రనగర్, హబ్సిగూడ, సంగారెడ్డి, సరూర్‌నగర్, మేడ్చల్, నల్లగొండ ప్రాంతాల్లో వందలాది సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిర్దేశిత సేవా సమయాన్ని(సర్వీస్ లెవల్) దాటి జాప్యమయ్యాయి. ఈ గణాంకాలు డిస్కంలు తమ సేవా పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు డిస్కంలు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.
Also Read: Telangana Panchayats: గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం

