Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులు, హవాలా డీలర్ల ఫోన్లు ట్యాప్ చేసి అప్పట్లో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ రావుకు సమాచారం ఇచ్చాడని సిట్ దర్యాప్తులో వెళ్లడయ్యింది. దీని ఆధారంగా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపి లక్షల్లో నగదును సీజ్ చేయించినట్టుగా తెలిసింది. భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ కు చెందిన 70లక్షల రూపాయలను ప్యారడైజ్ వద్ద ఇలా అందిన సమాచారంతోనే స్వాధీనం చేసుకున్నట్టుగా తేలింది. భవ్య ఆనంద్ టీడీపీ అభ్యర్థిగా శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతోనే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను కూడా రాధాకిషన్ రావు సీజ్ చేయించినట్టుగా తెలిసింది. మునుగోడు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలొ పోలీస్, రెవిన్యూ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం.