Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ ను పునరుద్ధరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ వరకూ ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. మరోవైపు పాస్ పోర్ట్ వచ్చిన వెంటనే మూడు రోజుల వ్యవధిలోనే ఇండియాకు తిరిగి రావాలని ప్రభాకర్ రావుకు న్యాయస్థానం స్పష్టం చేసింది. వేరే దేశానికి వెళ్ళకూడదని.. ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని సూచించింది.
Also Read: L&T On Medigadda Barrage: మేడిగడ్డ కుంగడంలో మా తప్పేం లేదు.. మీ రిపోర్టే రాంగ్.. ఎల్అండ్‌టీ బుకాయింపు!
అంతే కాదు ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభాకర్ రావును ఆదేశించింది. తమ తీర్పును ఏమాత్రం అవకాశంగా తీసుకోవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు చేశారు.