తెలంగాణ: Adalat program: వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న పెన్షన్, జిపిఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కు సంబంధించిన కేసులు అదాలత్ కార్యక్రమంతో పరిష్కారానికి నోచుకుంటాయని తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. పెన్షన్ డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా రానున్న ఆరు నెలల్లో పూర్తికానున్నట్లు ఆమె వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్, పీఏజీల సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీసులోని సమావేశ మందిరంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్లు, జీపీఎఫ్ అందచేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలాత్ లలో నివృత్తి చేసుకోవాలని సూచించారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే అట్టి పత్రాలను పరిశీలించిన తర్వాత మంజూరు ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన రోజే పెన్షన్ ఉత్తర్వులు అందించే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆమె తెలిపారు. పెన్షన్ అదాలత్ ద్వారా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పలు సమస్యలు, సందేహాలు ఏమైనా ఉంటే తెలపాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలోని శాఖాధికారులు ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ పత్రాలు, జీపీఎఫ్ ఫైనల్ పత్రాలు సత్వరమే క్రమ మార్గంలో ఏజీకి పంపించాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అని, అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటంతో పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, కోవిడ్ దృష్ట్యా పెన్షన్ అదాలత్ లు చేపట్టలేదని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పెన్షన్ సమస్యలను పెన్షన్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తో కలిసి పెన్షన్ మంజూరు పత్రాలు, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రావల్ ప్రొసీడింగ్స్ లను పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ సోనార్కర్, డీటీఏ జాయింట్ డైరెక్టర్ ప్రావీణ్య, వివిధ శాఖల అధికారులు, ఆడిట్ శాఖ అధికారులు కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Sircilla Crime: కనీవినీ ఎరుగని ఘోరం.. పళ్లతో కొరికి.. గొడ్డలితో నరికి హత్యాచారం!