MGNREGA: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో పంచాయతీరాజ్ శాఖ కీలక కసరత్తు ప్రారంభించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపు, లేబర్ బడ్జెట్ తయారీపై దృష్టి సారించింది. ఈ మేరకు పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ డా. జి. సృజన జిల్లా అధికారులకు సోమవారం అదనపు మార్గదర్శకాలను జారీ చేశారు.
వ్యక్తిగత పనులపై ప్రత్యేక శ్రద్ధ
ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల్లో వ్యక్తిగత లబ్ధిదారులకు సంబంధించిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం సమన్వయంతో పశువుల/గొర్ల/కోళ్ల పెంపకం పాకల నిర్మాణం, అజోల్ల సాగు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ పిట్‌ల నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను, ఉపాధిహామీ 31జిల్లాల కార్యక్రమ సమన్వయకర్తలు, అదనపు కలెక్టర్లు, డీఆర్‌డీవోలు, సీఈవోలు, ఇతర అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది.
Also Read: Telusu Kada Trailer: ఇద్దరు భామలతో స్టార్ బాయ్ రొమాన్స్.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ఎస్సీ, ఎస్టీలకు..
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూసల్’ భూముల్లో భూమి అభివృద్ధి పనులు, మళ్లింపు కాలువలు, కొత్త బావుల తవ్వకం వంటి పనులను చేపట్టాలని సూచించింది. గ్రామీణ మౌళిక వసతులు, పారిశుద్ధ్యం, జలనిధి (వర్షపు నీటిని ఒడిసిపట్టడం), పొలం బాటలు, ఫలవనాలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఈ ఏడాది అవసరమైన పనుల విలువ లేబర్ బడ్జెట్‌కు 200 శాతం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. మిషన్ వాటర్ కన్జర్వేషన్ మండలాల్లో సహజ వనరులకు సంబంధించిన పనులు 65 శాతం, వ్యవసాయ సంబంధిత పనులు 60 శాతం, వ్యక్తిగత పనులు 60 శాతానికి మించి గుర్తించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గ్రామసభల ద్వారా తీర్మానాలు
లేబర్ బడ్జెట్ తయారీకి సంబంధించి, గ్రామసభలు నిర్వహించి, గ్రామసహజ వనరుల కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో పనుల వివరాలను గుర్తించాలని ఆదేశించారు. గ్రామసభ ఆమోదంతో ఫార్మాట్-1లో పనుల వివరాలను పొందుపరిచి, పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను నవంబర్ 30 లోగా తప్పనిసరిగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వివరాలను కేంద్రానికి పంపి, తదనంతరం ఆ మార్గదర్శకాల ప్రకారం పనులు చేపట్టనున్నారు. ఎక్కువగా వ్యవసాయరంగ పనులపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ.. ఇంకా టైం పట్టనుందా..!
