తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : CM Revanth Reddy: కులగణన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాస్టర్ స్ట్రోక్ సక్సెస్ అయింది. ఏ పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా, సవరణలకు ప్రతిపాదనలకు రాకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందడంలో ఆయన వ్యూహం సత్ఫలితాలను ఇచ్చింది. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ప్రతిపక్షాలు సైతం ఆమోదం తెలపక తప్పలేదు. వ్యతిరేకిస్తే బీసీల ఓటు బ్యాంకు దూరమవుతుందనే భయంతో ప్రభుత్వ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
కులగణన ఫస్ట్ ఫేజ్ సర్వే పూర్తయిన తర్వాత అసెంబ్లీ వేదికగా వివరాలను వెల్లడించినప్పుడు తప్పుల తడక అంటూ ఘాటుగా విమర్శలు చేసినా బిల్లుకు ఆమోదం తెలిపేదగ్గర ప్రభుత్వానికి అండగా నిలవడం విశేషం. రాహుల్‌గాంధీ ‘బ్రెయిన్ చైల్డ్’గా భావించే కులగణన ఏడాది కాలంలోనే చట్టంగా రూపొందేలా సీఎం రేవంత్ కార్యాచరణ ఆయనకు ఇమేజ్ మరింత పెరిగేందుకు కారణమైంది. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచేలా చేయడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారు.
అభ్యంతరాల నుంచి ఆమోదం వరకు
బీసీల జనాభాను తగ్గించి చూపిందంటూ గత సమావేశాల్లో ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కులగణన గణాంకాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశాయి. బీసీలకు న్యాయం జరగడానికి బదులు వారి సంఖ్యను తక్కువ చేసి చూపడం ద్వారా అన్యాయం జరుగుతుందని విమర్శించాయి. గత ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే వివరాలకంటే బీసీల కుటుంబాల సంఖ్య ఇప్పుడు తగ్గిందని, ఇది శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కవిత సైతం బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ఉటంకిస్తూ బీసీ జనాభాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నదని, హామీ ఇచ్చినట్లుగా 42% ఇచ్చేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ఉద్యమిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం కులగణన ప్రక్రియలో శాస్త్రీయత లోపించిందని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ వస్తుందనే ఉద్దేశంతో తగ్గించి చూపిందని మండిపడ్డారు. మరోసారి సర్వే చేయాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. కానీ చివరకు కులగణనకు చట్టబద్ధత కల్పించడంలో మాత్రం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాయి.
సెకండ్ ఫేజ్ సర్వేతో చల్లబడిన విపక్షాలు..
సమగ్ర కుటుంబ సర్వే వివరాలు పబ్లిక్ డొమెయిన్‌లోనే ఉన్నాయని, వాటిని ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు కులగణనలో జరిగిన లోపాలు తేలిపోతాయని బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఆరోపించారు. బీసీ సంఘాల ప్రతినిధులు సైతం కులగణన గణాంకాలపై విరుచుకుపడ్డాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా వారితో సమావేశమై ప్రక్రియను నిర్వహించిన తీరుపై వివరణ ఇచ్చారు.
బీసీ జనాభా తగ్గిందనే ఆరోపణలను ప్రస్తావిస్తూ కులగణన, గతంలోని సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎన్యూమరేటర్ల మొదలు డేటా ఎంట్రీ వరకు అనుసరించిన విధానాలను, రూపొందించుకున్న మార్గదర్శకాలను, ప్రశ్నావళిని వివరించారు. చివరకు విపక్షాలు, బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, సలహా మేరకు ఫిబ్రవరిలో ప్రభుత్వం సెకండ్ ఫేజ్ సర్వే నిర్వహించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తుది నివేదికను పరిగణనలోకి తీసుకుని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అన్ని పార్టీలూ ప్రభుత్వానికి అండగా నిలిచాయి
కులగణన విషయంలోనే తీన్మార్ మల్లన్న తిరుగుబాటు మొదలుపెట్టారు. గత సెషన్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కాపీని తన సొంత వీడియో ఛానెల్ వేదికగా ముక్కలుగా చింపివేశారు. అప్పటి నుంచి సీఎం రేవంత్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టారు. చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఆయనేనంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్ సైతం కులగణను తప్పుపట్టారు.
ఇంతకాలం ఏ పార్టీ ఎలాంటి విమర్శలు చేసినా బిల్లు విషయంలో మాత్రం మద్దతు ప్రకటించక తప్పలేదు. బిల్లును వ్యతిరేకించినా ఉపయోగం ఉండదని ప్రతిపక్షాల్లో నెలకొన్న అభిప్రాయం ఒకటైతే, బీసీ ఓటు బ్యాంకు దూరమవుతుందనే భయం మరోవైపు.. ఈ కారణంగా బిల్లుకు మద్దతు ప్రకటించక తప్పలేదు. కులగణన విషయంలో సీఎం వ్యూహాత్మకంగా అనుసరించిన విధానం చివరకు ప్రతిపక్షాలను దారికి తెచ్చుకోడానికి దోహదపడింది. బీసీలను దగ్గర చేసుకోడానికి కాంగ్రెస్‌కు కులగణన కలిసొచ్చినట్లయింది. మరోవైపు రాహుల్‌గాంధీ దృష్టిలో ప్రత్యేక ప్రశంసలు అందుకోడానికి ఉపయోగపడింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం https://epaper.swetchadaily.com/l లింక్ క్లిక్ చేయండి