Operation Muskan: నిరుపేద కుటుంబాలే ఆ గ్యాంగుల టార్గెట్ ముందుగా వారితో పరిచయాలు ఏర్పరుచుకుంటారు. చిన్నాచితక సాయాలు చేసి మంచివారిలా నటిస్తారు. ఆ తరువాత కుటుంబ పోషణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు కదా! అంటూ సానుభూతి ఒలకబొస్తారు. అవతలివారు పూర్తిగా తమ ఉచ్ఛులో చిక్కుకున్నారని నిర్ధారించుకున్న తరువాత మీ పిల్లలను మాతో పంపించండి పనుల్లో పెట్టిస్తామని చెబుతారు. వేన్నీళ్లకు చన్నీళ్లలా వారి సంపాదన మీకు ఉపయోగపడుతుందంటారు. అడ్వాన్సుగా కొంత డబ్బు తల్లిదండ్రుల చేతుల్లో పెడతారు. ఇలా యేటా వందల సంఖ్యలో బాలబాలికలను రాష్ట్రాలు దాటిస్తున్నారు. బాలురను వెట్టి కార్మికులుగా మారుస్తున్నారు. పదిహేనేళ్ల పైబడి వయసున్న బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. అంతకన్నా చిన్న వయసుంటే ఇళ్లల్లో పనులకు కుదిరిస్తున్నారు. పాపం పుణ్యం తెలియని పసిపిల్లలను నరకంలోకి నెట్టేస్తూ తాము మాత్రం డబ్బు సంపాదించుకుని జల్సాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ(Telangana)తోపాటు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఈ చైల్డ్ట్రాఫికింగ్ వ్యవస్థీకృతంగా కొనసాగుతోంది. బాధాకరమైన అంశం ఏమిటంటే ట్రాఫికర్ల చేతుల్లో చిక్కుకుని కనిపించకుండా పోతున్న పసిపిల్లల గురించి పోలీసుల వద్ద పెద్దగా సమాచారం ఉండక పోతుండటం. దీనికి కారణం ట్రాఫికర్ల నుంచి డబ్బు తీసుకుంటున్న తల్లిదండ్రులు స్వచ్ఛంధంగానే తమ పిల్లలను వారి వెంట పంపిస్తుండటం. నెలకు ఎంత డబ్బు వస్తోంది అని చూసుకోవటం తప్పితే తమ పిల్లలు ఎక్కడ? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? అన్న విషయాలను పెద్దగా పట్టించుకోక పోతుండటం. ఇలా చైల్డ్ ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగులు దేశం మొత్తం మీద వందల్లో ఉంటాయని ఓ సీనియర్ పోలీసు అధికారే చెప్పటం గమనార్హం.
వెట్టి చాకిరి లోకి..
ఈ ముఠాల చేతుల్లో చిక్కుతున్న బాలబాలికల్లో అధికశాతం మంది వెట్టి కార్మికులు(Wet workers)గా మారుతున్నారు. పది నుంచి పదిహేను సంవత్సరాల వయసున్న బాల బాలికలను ఇటుక బట్టీలు, హోటళ్లు, దాబాలు, గాజుల తయారీ పరిశ్రమలు, ప్లాస్టిక్ పరిశ్రమలు ఇలా పలు చోట్ల ఉద్యోగాలకు పెడుతున్నారు. ఇలా చేసినందుకు ఒక్కో పిల్లవానికి ఇంత అని ఆయా దుకాణాల యజమానుల నుంచి కమీషన్ల రూపంలో వేలకు వేలు దండుకుంటున్నారు. ఇక, ఆయా పరిశ్రమలు, హోటళ్లు, దాబాల యజమానులు పిల్లలు ఉండటానికి వసతి కల్పిస్తున్నారు. రెండు పూటల భోజనం పెట్టి రోజుకు పదిహేను గంటలకు పైగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఇన్నిన్ని గంటలు పని చేయలేమని ఎవరైనా అంటే వారిని శారీరకంగా హింసిస్తున్నారు.
బెగ్గింగ్ మాఫియా
ఇక, తల్లిదండ్రులు మందలించారనో అడిగింది కొనివ్వలేదనో చదువుకోలేకనో ఇళ్లలో నుంచి బయటకు వస్తున్న బాల బాలికల్లో అధికశాతం మంది బెగ్గింగ్మాఫియా(Begging mafia) ఉచ్ఛులో చిక్కుకుంటున్నారు. ప్రతీ మెట్రోపాలిటన్ సిటీలో కొన్ని గ్యాంగులు చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తూ డబ్బు సంపాదించుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ ముఠాల్లోని సభ్యులు ముఖ్యంగా రైల్వే, బస్ స్టేషన్ల వద్ద తిష్ట వేస్తూ చిన్నపిల్లలు ఎవరైనా వెంట పెద్దలు లేకుండా కనిపిస్తే వారి దగ్గరకు వెళతారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? అన్న వివరాలు కనుక్కుంటారు. ఆ తరువాత టిఫినో భోజనమో పెట్టించి మాతోపాటు వస్తే ఉండటానికి చోటు చేయటానికి పని కల్పిస్తామని చెప్పి వెంట తీసుకెళతారు. ఆ తరువాత చిన్నపిల్లలను భిక్షాటనలోకి దింపుతున్నారు. ఆ పని చేయమని ఎవరైనా అంటే వారిని దారుణంగా హింసిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బు ఎక్కువగా వస్తుందని పిల్లలను అంగవికలురుగా కూడా మారుస్తున్నారు.
Also Read: TG Rain Update: వర్షాలపై పిడుగు లాంటి వార్త.. పాపం రైతన్నల పరిస్థితి ఏంటో!
వ్యభిచార కూపంలోకి..
ఇక, పదిహేనేళ్ల వయసు దాటిన బాలికలను చైల్డ్ట్రాఫికర్లు వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఒక్కో బాలికను అప్పగించినందుకుగాను యాభైవేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఇలా వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్న బాలికలు దాని నుంచి బయట పడే దారి కానరాక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. క్షణక్షణం ఛస్తూ బతుకుతున్నారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడగా చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking) కు చెక్ పెట్టటానికి ఆయా రాష్ట్రాల పోలీసులు, రైల్వ ప్రొటెక్షన్ఫోర్స్తోపాటు వేర్వేరు విభాగాలకు సిబ్బంది పని చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావటం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం అధికశాతం మంది సిబ్బంది విధుల నిర్వర్తనలో అలసత్వాన్ని కనబరుస్తుండటమే అని చెప్పారు. కొన్నిసార్లు పిల్లలను రక్షిస్తున్నా వారిని తరలించిన ట్రాఫికర్ల వివరాలు తెలియటం లేదని వివరించారు. అపుడపుడు ఆపరేషన్ముస్కాన్ స్మైల్(Operation Muskan Smile)పేర స్పెషల్డ్రైవ్లు నిర్వహించటం వల్ల పెద్దగా ఫలితం ఉండదన్నారు. ట్రాఫికింగ్ ముఠాలపై నిరంతర నిఘా పెట్టి ఆయా రాష్ట్రాల పోలీసులు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ పకడ్భంధీగా వ్యవహరిస్తేనే ఈ తరహా నేరాలకు కొంతలో కొంతైనా కళ్లెం వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
1వ తేదీ నుంచి ఆపరేషన్ ముస్కాన్
తప్పిపోయిన అనాథలతోపాటు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాల చేతుల్లో చిక్కుకున్న పిల్లలను రక్షించే లక్ష్యంతో వచ్చనెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆపరేషన్ ముస్కాన్(Operation Muskan) మొదలు కానుంది. నెలరోజులపాటు ఇది కొనసాగనుంది. ఇలాంటి పిల్లలను కాపాడటంతోపాటు వారికి పునరావాసం కల్పించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ జరపాలని ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలకు సూచించింది. దీనికి రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నోడల్ఏజన్సీగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్జనరల్చారు సిన్హా ఇటీవల వేర్వేరు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. చైల్డ్ ట్రాపికర్ల చేతుల్లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న పిల్లలను కాపాడటానికి 706 మంది పోలీసు సిబ్బందితో 121 సబ్డివిజనల్బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఆయా శాఖల సిబ్బందితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుపనున్నాయి.
Also Read: Youtube New Rules: రూల్స్ మార్చిన యూట్యూబ్… ఇకపై వారికి కుదరదు