Dornakal: డోర్నకల్ నియోజకవర్గం లోని ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే నూకల నరేష్ రెడ్డి పై ప్రేమతో నన్ను ఆదరించండి అని ఆయన రాజకీయ వారసుడు నూకల అభినవ్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పురుషోత్తమయ గూడెం గ్రామ శివారు నరేష్ రెడ్డి ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభినవ్ రెడ్డి మాట్లాడారు. 1988 నుంచి డోర్నకల్ నియోజకవర్గం తోపాటు పరిసర ప్రాంత ప్రజలకు రాజకీయ సేవలు నూకల నరేష్ రెడ్డి అందించారని కొనియాడారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నరేష్ రెడ్డి పై మీరు చూపిస్తున్న ఆప్యాయతను తనపై చూపాలని కోరారు. నూకల నరేష్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చానని రానున్న రోజుల్లో ప్రజల అండదండలు తనకు అందించాలని, తనవంతుగా నరేష్ రెడ్డి వారసుడిగా రాజకీయ సేవలను అందిస్తానని పేర్కొన్నారు. ఉన్నత ఉద్యోగాలను వదులుకొని నాన్న ఆశయ సాధనలో తన వంతు పాత్ర పోషించాలని రాజకీయాలకు వచ్చినట్లుగా తెలిపారు. యువత, రైతులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ వారి ప్రేమ ఆప్యాయతలను తనపై చూపించాలని వేడుకున్నారు. నాన్న చూపిన ప్రేమనే నేను సైతం మీ పైన చూపిస్తానని స్పష్టం చేశారు. రాజకీయం కేవలం స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసమే నరేష్ రెడ్డి చేశారని ఆ దిశగా నేను సైతం చేస్తానని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రజలకు అహర్నిశలు సేవ చేస్తానని వెల్లడించారు.
ఈ నెల 23న మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా నరేష్ రెడ్డి విగ్రహావిష్కరణ
ఈ నెల 23న మరిపెడ మండలంలోని పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారులోని ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో నూకల నరేష్ రెడ్డి కి రాజకీయ గురువు, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి చేతుల మీదుగా నూకల నరేష్ రెడ్డి విగ్రహావిష్కరణ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్రస్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. నరేష్ రెడ్డి పై ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్న ప్రజలందరూ ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.