= రేవంత్‌తో కిస్సా.. కిషన్‌రెడ్డి గుస్సా..
= కౌంటర్ఇవ్వని కమలనాథులు
= త్వరలోనే కొత్త ప్రెసిడెంట్
= రెస్పాండ్ అయినా నో యూజ్అనే భావనలో కేడర్!
– గతంలోనూ పెద్ద నేతలకు ఇదే పరిస్థితి
Kishan Reddy : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఆయన సైన్యం లేని సేనాధిపతి. కాషాయ దళపతిగా నాలుగుసార్లు బాధ్యతలు నిర్వర్తించినా.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. ఆయనపై విమర్శలు చేసినా.. ఆరోపణలు సంధించినా.. ఆ పార్టీ నేతలు మాత్రం కౌంటర్అటాక్చేయడం లేదు. ఆదర్శవంతమైన నాయకుడని చెప్పుకునే ఆ నేత వెంట నడిచేందుకు నలుగురు లీడర్లు కూడా కరువైనట్లు తెలుస్తున్నది. దీనికి తాజా పరిస్థితులే నిదర్శనం. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఘాటు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయినా తమకేం పట్టదన్నట్లుగా కమలనాథులు వ్యవహరిస్తున్నారు. ఇది ఒక్క కిషన్ రెడ్డికే పరిమితం కాలేదు. గతంలో బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర లీడర్ల అంశంలోనూ ఇలాగే జరగడం గమనార్హం.
ఖండించని కాషాయ నేతలు..
కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా, ఇటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి నేతపై విమర్శలు చేస్తున్నా తమకేం పట్టదన్నట్లుగా కాషాయ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలో పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించనున్నారు. ఈ తరుణంలో ఆయనకు సపోర్ట్ చేసి కొత్తగా ప్రెసిడెంట్ అయ్యే వారితో గ్యాప్ పెంచుకోవడం ఎందుకనే ఉద్దేశంతో రెస్పాండ్ అయినా నో యూజ్ అనే భావనలో కేడర్ ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరుగుతున్న కిస్సాలో కిషన్ రెడ్డే స్వయంగా ఖండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాషాయ దళపతి ఒంటరైనట్లుగా అర్థమవుతున్నది. వాస్తవానికి పొలిటికల్ లీడర్ల మధ్య విమర్శలు సర్వసాధారణం. ఒకరిపై కౌంటర్ ఇస్తే.. కేడర్ అంతా ఎదురుదాడికి దిగుతుంది.. కానీ కాషాయ పార్టీలో మాత్రం ఆ సీన్ కనిపించడం లేదు. ఎవరి తీరు వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నేతల మధ్య కొరవడిన కోఆర్డినేషన్!
వాస్తవానికి కాషాయ పార్టీలో ముందు నుంచే నేతల మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా లేదనేది బహిరంగ రహస్యమే. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయినా నేతలు తమ తీరు మార్చుకోలేదు. హైకమాండ్ మార్గ నిర్దేశం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయఢంకా మోగించినా సమన్వయం మాత్రం సెట్ అవ్వలేదు. గతంలో బండి సంజయ్‌ను కేటీఆర్ విమర్శించినా, ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసినా, తాజాగా కిషన్ రెడ్డిని కౌంటర్ చేస్తున్నా ఇతర నేతలు మాత్రం ఎవరూ నోరు మెదపకపోవడాన్ని చూస్తుంటే బీజేపీలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా అర్థమవుతున్నది. ప్రెసిడెంట్ నియామకంపై సైతం హై కమాండ్ తాత్సారం వహిస్తుండటంతోనూ కేడర్‌లో జోష్ తగ్గినట్లు తెలుస్తున్నది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం నేతల మధ్య సమన్వయం లేకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఢీకొట్టడం అంత సులువు కాదనేది జగమెరిగిన సత్యం. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న కమలనాథులు ఇప్పటికైనా సెట్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.