Sitarama Project: నానో యూరియాను ప్రోత్సాహించేందుకే యూరియా సరఫరాలో కోత
రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
కారేపల్లి, స్వేచ్ఛ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూములకు నీరు అందించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాల నుంచి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మండిపడ్డారు. ఆదివారం కారేపల్లి మండలం పాటిమీదిగుంపులో రైతు సదస్సులో రాంబాబు మాట్లాడారు. 2000 సంవత్సరం నుంచి మూడు వరుస వ్యవసాయ సీజన్లలో వచ్చిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో, ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కూడా బీడుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో సాగునకు గోదావరి జలాలు తరలింపు మాత్రమే పరిష్కారమని ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారని గుర్తుచేశారు. 2023లో ‘గోదావరి జలాలు సాధన మహాప్రస్థానం పాదయాత్ర’ కూడా నిర్వహించారని అని ప్రస్తావించారు.
2004లో నాడు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2025 డిసెంబర్ 31న దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసినా.. నేటికీ పూర్తి చేయడంలేదని మండిపడ్డారు. 2016లో కేసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రీడిజైన్ పేరిట మార్పు చేసి, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్‌ను జూలూరుపాడు మండలం చివరివరకు పూర్తి చేసిందని, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయింపులు లేకపోవడంతో పనులు కొనసాగడం లేదని బొంతు రాంబాబు విమర్శించారు. గోదావరి జలాలు పాలేరుకు అనుసంధానం చేయడంతో పాటు కామేపల్లి, కారేపల్లి మండలాల పరిధిలో సాగు భూములకు నీరు అందించాలని, సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, రైతు ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Read Also- Madarasi Movie Update: ఇలాంటి సాంగ్ పడితే శివ కార్తికేయన్ దొరకడు.. ఇలా ఎలా అనిరుద్?
వ్యవసాయ సీజన్ మొదలయ్యేది ముందుకు జరగడం, ఇతర పంటల సాగు తగ్గిపోయి, పత్తి సాగు పెరగడం, కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో కోత పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడిందని బొంతు రాంబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా ఉత్పత్తి పరిశ్రమను నెల రోజుల నుంచి ఎందుకు మూసివేశారని, ఇది సహేతుకం కాదని మండిపడ్డారు. తెలంగాణకు వచ్చే యూరియా వాటా రాకుండా చేశారంటున్న రైతుల ఆవేదన అర్థం చేసుకోకుండా, మంత్రులు యూరియా సమస్య రాజకీయ పార్టీల సృష్టి అన్నట్టుగా ప్రకటనలు చేయడం సహేతుకం కాదని బొంతు రాంబాబు విమర్శించారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ఐక్య రైతు ఉద్యమమే మార్గమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కే.నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, నాయకులు సీతారామయ్య, మాజీ సర్పంచ్ రాంబాయిమ్మ, ధనమ్మ, వెంకన్న, శ్రీనివాసరావు, రవి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.