Negative inflation: సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదయింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, అసోం, బీహార్‌తో పాటు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఉంది. ఇంతకీ మైనస్ ద్రవ్యోల్బణం (Negative Inflation) అంటే ఏమిటి?, ఇది దేనికి సంకేతం?, జనాలు, ప్రభుత్వంపై ఏవిదమైన ప్రభావం ఉంటుంది? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. సాధారణంగా ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని అంటారు. రివర్స్‌లో లక్షిత పరిధి కంటే ధరలు తగ్గడాన్ని మైనస్ ద్రవ్యోల్బణం అని వ్యవహారిస్తారు.
ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఆర్బీఐ నిర్దేశించిన ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ (Flexible Inflation Targeting) విధానం ప్రకారం, ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్ 2 శాతం పరిధిలో ఉండాలి. అంటే, ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంటే ఆమోదయోగ్య పరిధిగా పరిగణిస్తారు. ఈ కట్టుతప్పితే ప్రతికూలంగా పరిగణిస్తుంటారు.
నెగిటివ్ ద్రవ్యోల్బణం వస్తే?
నెగిటివ్ ద్రవ్యోల్బణాన్ని డిఫ్లేషన్ (Deflation) అనే ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో ధరలు తగ్గి ప్రజలకు కొంత ప్రయోజనం చేకూరుతుంది. పరిశ్రమలు, మార్కెట్లు, వినియోగదారులను ఇది ప్రభావితం చేస్తుంది. డిమాండ్ తగ్గిపోవడం కారణంగా ఈ పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడాన్ని ఈ పరిస్థితి సూచిస్తుందని అంటున్నారు.
సరఫరా లేదా ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, కొనుగోలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు పడిపోతాయి. మార్కెట్లో డిమాండ్ పడిపోయినప్పుడు, వ్యాపారులు ధరలు తగ్గిస్తారని, ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మైనస్ ద్రవ్యోల్బణానికి దారితీసే కారణాల విషయానికి వస్తే, ప్రభుత్వాలు వ్యయాలు తగ్గించుకోవడం కూడా ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గితే, తద్వారా వినియోగం పడిపోతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంత ప్రభావం ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే లోన్లు తీసుకునేవారు తగ్గిపోతారు. అప్పుడు వ్యయాలు చేయరు కాబట్టి డిమాండ్ కూడా ఆటోమేటిక్‌గా తగిపోతుంది.
Read Also- Deflation Kavitha: గ్రూప్-1 విద్యార్థులకు అన్యాయం చేయొద్దు.. గత ప్రభుత్వం చేసినందుకే ఓడించారు.. కవిత కీలక వ్యాఖ్యలు
ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది?
వస్తువుల ధరలు తగ్గటం జనాకు కొంతవరకు ప్రయోజనం కలిగించే విషయమే. ముఖ్యంగా నిత్యావసరాల విషయంలో ఉపశమనంగా ఉంటుంది. అయితే, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ తగ్గితే, కంపెనీలు ఉత్పత్తి తగ్గిస్తాయని, తద్వారా ఉద్యోగాల కోతకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. తక్కువ ధరలకు విక్రయాల కారణంగా వ్యాపారాలకు లాభాలు తగ్గిపోతాయని, ఇది ప్రభుత్వ రాబడిపై కూడా ప్రభావం చూపవచ్చని అంటున్నారు. ధరలు మరింత తగ్గుతాయేమోనని జనాలు ఎదురుచూస్తూ మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురువుతాయని చెబుతున్నారు.
Read Also- Venu Swamy puja: తాంత్రిక పూజలు చేస్తూ మరోసారి వైరల్ అయిన వేణు స్వామి .. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
ప్రభుత్వాలపై ప్రభావం
నెగిటివ్ ద్రవ్యోల్బణం ప్రభుత్వాలపై కూడా ప్రభావం చూపుతాయి. పన్నుల ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు. వ్యాపారాలు, వినియోగం తగ్గితే జీఎస్టీ, వ్యాట్ వంటివి తగ్గిపోతాయి. మొత్తంగా వృద్ధి రేటు దెబ్బతినే అవకాశం ఉంటుంది. డిమాండ్-సరఫరా మధ్య సమతుల్యత లేకుంటే వృద్ధి మందగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ద్రవ్య విధానం (Monetary policy) సర్దుబాటు, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గింపు ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతుంది.

