తెలంగాణ: Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యాం ఓనర్ తెలంగాణలేదేనని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ అధికారులు వాలంతరీలో ఇరిగేషన్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. సాగర్ డ్యామ్ ఓనర్ ఎవరో తేల్చాలని అధికారులు కోరారు. దీనికి చైర్మన్ తెలంగాణే డ్యామ్ ఓనరని చెప్పడంతో అదే విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులు కోరినట్లు సమాచారం. ధర్మపోర్టల్లో పేర్కొన్నదాని ప్రకారమే డ్యామ్ ఓనర్లుంటారని, దీనిపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకుంటుందని అనిల్ జైన్ పేర్కొన్నారు.
శ్రీశైలం ప్లంజ్‌పూల్‌లో పడిన భారీ గొయ్యితో డ్యామ్ కటాఫ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయని, రానురాను డ్యామ్ కు ముప్పు ఏర్పడుతుందని అధికారులు ఎన్డీఎస్ఏ దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలానికి మరో నెల మాత్రమే సమయం ఉందని, ఈలోగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అయితే, డ్యామ్ సేఫ్టీ కోసం తాత్కాలిక చర్యలు ఏవైనా ఉంటే చెప్పాలని చైర్మన్ అధికారులకు సూచించారు.అనంతరం శ్రీశైలం ప్లంజ్ పూల్ గొయ్యితో పాటు రాష్ట్రంలో అన్ని డ్యాముల రక్షణకు తీసుకుంటున్న చర్యలపైనా చర్చించారు.
త్వరలో మేడిగడ్డపై ఢిల్లీలో సమావేశం
మేడిగడ్డ బ్యారేజ్ పై ఏం చేయాలనేదానిపై త్వరలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తెలిపారు. సమావేశానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఫైనల్ రిపోర్టులో ఎలాంటి చర్యలను సిఫార్సు చేయలేదని అధికారులు వివరించారు. రిపేర్లు, శాశ్వత లేదా తాత్కాలిక చర్యలను సిఫార్సు చేసి ఉంటే బాగుండేదని చెప్పినట్టు సమాచారం.
స్పిల్ వే కింది వరకూ వెళ్లి సులభంగా రిపేర్లు చేసేలా టవర్ క్రేన్లను డ్యామ్ పై ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌పై అధికారులకు శిక్షణనిస్తున్నామని వివరించారు. అన్ని డ్యామ్లకూ ఓ అండ్ ఎం మాన్యువల్స్‌ను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను చైర్మన్ అనిల్ జైన్ ఆదేశించారు. డ్యామ్‌ల రక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై ఎన్డీఎస్ఏకి అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు.