Naini Coal Mine: ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశాలో నైనీ బొగ్గు గనిని సింగరేణి విజయవంతంగా ప్రారంభించిందని, ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మరిన్ని గనులు, ఇతర ఖనిజ ఉత్పత్తులను కూడా చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. నైనీ బొగ్గు గని ప్రారంభంతో సింగరేణి ఎక్కడైనా విస్తరించగలదన్న భరోసా, నమ్మకం అందరిలో కలిగిందన్నారు.
నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించిన సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు సీఎండీకి అభినందనలు తెలిపారు. ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాకు సాధన వెనుక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పాటు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, వివిధ శాఖల అధికారుల సహకారం ఉందని, తాను సమన్వయ బాధ్యతను స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
Aslo Read: Hyderabad Alert: నీటి కోసం అలా చేస్తున్నారా.. డేంజర్ లో పడ్డట్లే.. అధికారులు వార్నింగ్!
సింగరేణి సంస్థ ఇకపై కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా ఇతర ఖనిజాల ఉత్పత్తి సంస్థగా కూడా ఎదగనుందని, థర్మల్ విద్యుత్ తో పాటు, పునరుత్పాదక విద్యుత్ రంగంలో కూడా విస్తరించనుందని తెలిపారు. సీఎండీని అభినందించిని వారిలో రాష్ట్ర కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, రాజ్ కుమార్, సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణ రావు, సూర్యనారాయణ రావు, వెంకటేశ్వర్లు, జీఎం మనోహర్, కార్పొరేట్ విభాగాల అధిపతులు, హైదరాబాద్ సింగరేణి భవన్ జీఎం రాజశేఖర్ రావు, ఆయా ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.
రామగుండం సింగరేణి హైస్కూల్లో సీబీఎస్ఈ బోధనకు అనుమతి మంజూరు
సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్(సీబీఎస్ఈ) తో కూడిన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సంస్థ సీఎండీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవతో సత్ఫలితానిచ్చింది. రామగుండం-2 ఏరియాలో గల సింగరేణి హైస్కూల్ సెక్టార్-3 పాఠశాలలో సీబీఎస్ఈ బోధనకు అనుమతి మంజూరైంది.
ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ నుంచి అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సింగరేణి విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏడాది క్రితం సంస్థ సీఎండీ సీబీఎస్ఈ అధికారులను సంప్రదించారు.
సింగరేణి పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాలతో, ల్యాబ్ లు, క్రీడ మైదానాలు విశాలమైన తరగతి గదులు వంటి వసతులతో ఉన్నాయని, తగిన అర్హతలు గల బోధనా సిబ్బంది కూడా ఉన్నందువల్ల కార్మికుల పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనకు అనుమతించాలని కోరారు.
దీనిపై గతేడాది డిసెంబర్ లో రామగుండం-2 ఏరియాలోని స్కూల్ ను సీబీఎస్ఈ అధికారుల బృందం పర్యవేక్షించి వసతుల్ని పరిశీలించారు. దీంతో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ విద్యాబోధన ప్రారంభం కానుంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు