Naini Coal: ఒడిశా నైనీ బొగ్గు గనుల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్(Congress) మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్నది. ఈ క్రమంలో పదేండ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన అవకతవకలను హస్తం నేతలు బయటకు తీస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ఓవర్ బర్డెన్(ఓబీ) కాంట్రాక్టులు, సత్తుపల్లిలోని జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై వచ్చిన ఆరోపణలను హైలైట్ చేస్తున్నారు.
అంచనా రేట్ల కంటే ఎక్కువ ధర
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు కాంట్రాక్టులు అంచనా విలువలకు మించి ఎక్కువ రేట్లకు ఖరారయ్యాయని గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. 2015 నుంచి 2023 మధ్య 20 వరకు ఓబీ కాంట్రాక్టులు ఫైనల్ అయ్యాయి. వీటిలో కొన్ని అంచనా రేట్ల కంటే గణనీయంగా ఎక్కువ ధరకు ఇవ్వబడ్డాయి. పీకేఓసీ 4, ఎంఎన్‌జీ మైన్ కాంట్రాక్ట్ అంచనా రేటుపై అత్యధికంగా 35.57 శాతం వ్యత్యాసంతో ఖరారైంది. గత ప్రభుత్వ హయాంలో సగటున 4.7 శాతం అధిక రేట్లకు కాంట్రాక్టులు ఇవ్వగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో(2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య) ఈ సగటు వ్యత్యాసం 4.07 శాతంగా ఉన్నదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన సంస్థ గత బీఆర్ఎస్ హయాంలో రెండు కాంట్రాక్టులు సాధించుకున్నది. వీటిలో ఒకటి అంచనా రేటు కంటే తక్కువకు కోట్ చేయగా అది రద్దయింది. ఆ తర్వాత, 2023 సెప్టెంబరులో అదే కాంట్రాక్టును 4.34 శాతం అధిక రేటుతో తిరిగి దక్కించుకున్నది.
Also Read: Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్
జేవీఆర్ ప్లాంట్‌లో నిర్మాణ లోపాలు
సత్తుపల్లిలో 2019లో రూ.398 కోట్ల వ్యయంతో నిర్మించిన జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. 2022లో పనులు పూర్తయినప్పటికీ, 2024లోనే బంకర్ల బీమ్స్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో బంకర్ పని చేయకుండా పోయింది. ఈ కాంట్రాక్టులో కేవలం ఒక సంవత్సరం మాత్రమే డిఫెక్ట్ లయబిలిటీ పిరియడ్ ఉండడం విమర్శలకు దారి తీసింది.
అదానీ కాంట్రాక్ట్ రద్దు
ఒడిశాలోని నైనీ మైన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్ కాంట్రాక్టును 2021 డిసెంబర్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అంచనా రేటు కంటే 44.82 శాతం అధిక ధరకు ప్రతిపాదించారు. అయితే, తర్వాత ఇది రద్దయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవకలు ఇప్పుడు నైనీ వ్యవహారం నేపథ్యంలో తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
Also Read: Naini Coal Block: యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయ మిది.. భట్టి విక్రమార్క

