తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్తపార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశంను స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండాలో ఉండనుందని, అది లైట్ బ్లూ కలర్ లో ఉంటుందని సమాచారం. కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాగృతి శ్రేణులు, బీసీ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికిన బ్యానర్ లో కవిత ఫొటో తప్ప ఎవరి ఫొటోలు కనిపించలేదు. దీంతో పార్టీ పెడుతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది.
కవిత సామాజిక తెలంగాణ అంశంతో ముందుకు సాగుతున్నారు. అదే అంశంతో కొత్తపార్టీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అదేరోజూ పార్టీ ప్రకటించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ టీబీఆర్ఎస్ అని నామకరణం చేస్తారని, ఆ పార్టీలో బహుజన పదం ఉండేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి(టీబీఆర్ఎస్) అని ప్రచారం ఊపందుకుంది. మేడే ను పురస్కరించుకొని కవిత నివాసంలో కార్మిక సంఘాలతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలని, మే డే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకే సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. రైతు, బీసీ, మహిళ, యువత ఓటు బ్యాంకుపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.
లైట్ బ్లూతో పార్టీ జెండా?
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఫూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు అంశంపై ఇప్పటికే పోరాట బాట పట్టారు. అయితే అమెరికా నుంచి శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవితకు బీసీ సంఘాలు, జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. స్వాగత బ్యానర్ లైట్ బ్లూ కలర్ లో ఉంది. ఇది సామాజిక తెలంగాణ సాధనకు దగ్గరగా ముడిపడి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే కలర్ పార్టీ జెండా ఉంటుందని సమాచారం. త్వరలోనే పార్టీగుర్తుపైనా చర్చిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర బొమ్మతో పాటు ప్రజలు జెండాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఫూలే ఫొటో పెడతారా? లేదా అనేది చూడాలి. మరోవైపు కవితకు స్వాగతం పలికిన సమయంలో ప్లకార్డుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరి ఫొటోలు లేవు. కేవలం ఆమె పొటో మాత్రమే ఉండటం చర్చకు దారితీసింది. అదే విధంగా మేడే రోజు కవిత ఇంట్లో నిర్వహించిన ఉత్సవంలో ఏర్పాటు చేసిన బ్యానర్ లో సైతం కేసీఆర్ పొటో కనిపించలేదు.
కేటీఆర్ తో విభేదాలే కారణమా?
కవిత, కేటీఆర్ కు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో కవిత జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు పార్టీ అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఆమె పర్యటిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందని, కట్టడి చేయాలని భావించినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమెకు కేటీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందని, అంతేగాకుండా ఆమెకు పార్టీ కూడా ఆశించిన స్థాయిలో సపోర్టు చేయడం లేదని ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ సైతం కవిత ప్రచారం చేయవద్దని అధినేత కేసీఆర్ తో పేర్కొన్నారనే ప్రచారం జరిగింది. అయినా కవిత యాక్టీవ్ గా తిరుగడంతో పార్టీకి నష్టం జరుగుతుందని అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో కేటీఆర్, కవిత విభేదాలు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విమర్శలకు పదును..
అన్ని వర్గాలకు చెందిన ప్రజా సమస్యలపై గళమెత్తుతూ ముందుకు సాగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలకు పదును పెట్టారు. నేతలపైనా పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో దూకుడు పెంచారు. నేతలతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు. బీసీ, మహిళా, కార్మికసంఘాలతోనూ భేటీలు అవుతున్నారు. వారి హక్కుల కోసం పోరాటబాటపట్టారు. కులసంఘాలతోనూ సమావేశమవుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వారిని ఎప్పకటిప్పుడు జరుగుతున్న అన్యాయాలపై అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు బీసీ 42శాతం రిజర్వేషన్ల అంశం పైన పట్టుపడుతున్నారు. రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఉదాహరించారు. ‘రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.8 లక్షలు ఉంటే.. వికారాబాద్ జిల్లాలో రూ.లక్ష 58 వేలు మాత్రమే ఉందని, పది కిలోమీటర్లు దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాదకరం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు తొలగిపోవడానికి మే డే స్పూర్తి కావాలన్నారు. మరోవైపు’రైతుబంధు కింద ఎకరం ఉంటే రూ.పది వేలు.. పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చాం. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయాం’ అని అన్నారు. భవిష్యత్తులో భూమి ఉన్నా.. లేకున్నా ఎలా ఆదుకోవాలే అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. టార్గెట్ గా కవిత విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.