MLC Kavitha KTR
తెలంగాణ

MLC Kavitha | బీఆర్ఎస్‌లో బీసీ రగడ.. ‘అన్నకు షాక్ ఇచ్చిన చెల్లి’

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కులగణన అంశం బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపింది. పార్టీ వర్సెస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అనే కొత్త చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ (BC Reservations)ను ఖరారు చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే (Telangana Caste Census)పై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ (BRS) ఇప్పుడు హడావిడి మొదలుపెట్టింది. పార్టీతో సంబంధం లేకుండా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేరుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన యాక్టివిటీస్ చర్చనీయాంశమైంది. పార్టీ టేకప్ చేయాల్సిన అంశాన్ని కవిత టేకప్ చేశారని, ఈ విషయంలో పార్టీ విఫలమైందంటూ గులాబీ నేతల మధ్య చర్చ మొదలైంది. ఈ పరిణామాలను గమనించిన కొందరు పార్టీ అభిమానులు ‘అన్న కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన చెల్లి కవిత’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు ప్రత్యక్షమైంది. ఇది కూడా పార్టీలో వివాదానికి కారణమైంది. కవిత చేపట్టిన బీసీ ఇష్యూను చట్టసభల వేదికగా టేకోవర్ చేయడానికి పార్టీ కౌంటర్ వ్యూహాన్ని రూపొందించింది.

కులగణనపై శాసనమండలిలో జరిగే చర్చలో కవితకు స్థానం కల్పించకుండా ముగ్గురు బీసీ నేతలను ఎంపిక చేసింది. మధుసూదనాచారి, ఎల్.రమణ, బండ ప్రకాశ్ ముదిరాజ్‌లను మాట్లాడాల్సిందిగా నాయకత్వం ఆదేశించింది. ఈ ముగ్గురి పేర్లనే చైర్మన్ ఆఫీసుకు పంపింది. చట్టసభల వెలుపల కవిత చేపట్టిన యాక్టివిటీస్ హైలైట్ కావడంతో ఆమెకు మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వకుండా పకడ్బందీ స్కెచ్ వేసింది. కవితకు అవకాశం ఇవ్వలేదనే అంశం పార్టీలో చర్చకు దారితీస్తుందని గ్రహించిన నాయకత్వం అసెంబ్లీలో సైతం కేటీఆర్, హరీశ్‌రావులకు బదులుగా గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాసయాదవ్, కేపీ వివేకానంద గౌడ్ పేర్లను స్పీకర్ కార్యాలయానికి పంపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆ ముగ్గురితో టెలీకాన్ఫరెన్సులో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగతంగా కవితకు మైలేజీ రాకుండా పార్టీ ఎంపిక చేసిన సభ్యుల మాటలే రికార్డుల్లోకి ఎక్కేలా వ్యవహరించింది.

ముందుగానే మేల్కొన్న కవిత :

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టు కావడానికి ముందే బీసీల అంశాన్ని టేకప్ చేయాల్సిందిగా పార్టీ నాయకత్వానికి సూచించిందని, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆ ప్రతిపాదనను తిరస్కరించారన్న చర్చ జరిగింది. దీంతో కవిత తనదైన శైలిలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేరుతో కార్యకలాపాలను చేపట్టారు. గతేడాది జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగానే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ స్పీకర్‌కు రాతపూర్వకంగా చేసిన ప్రతిపాదనలో కూడా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో నెలకొల్పాలని కోరారు. కులగణన అంశం తెరపైకి రాకముందే బీసీ సంఘాలతో వరుస సమావేశాలను ఏర్పాటు చేసిన కవిత… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ ఇచ్చిన 42% హామీ అమలు కోసం పట్టుబట్టాలని వారికి దిశానిర్దేశం చేశారు. గత నెల 3న ఇందిరాపార్కులో భారీ సభను నిర్వహించి దాదాపు 80 బీసీ సంఘాల శ్రేణులను సమీకరించి తీర్మానాలను ఆమోదించేలా చొరవ తీసుకున్నారు.

బీసీ రిజర్వేషన్ అంశంలో పార్టీ కంటే కవిత పైచేయి సాధించారనే చర్చ జరగడంతో నాయకత్వం అప్రమత్తమైంది. ఈ నెల 4న బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయని, కానీ ఈ నెల 2వ తేదీన ప్లానింగ్ డిపార్టుమెంటు కులగణన తుది నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చిన వెంటనే బీసీ సంఘాల ప్రతినిధులతో కవిత తన నివాసంలో సమావేశమయ్యారు. దీనికి తోడు కులగణన గణాంకాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించడంతో పాటు 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సెషన్ కూడా ఉంటుందని ప్రకటించడంతో బీఆర్ఎస్ ప్రీ-షెడ్యూలు చేసుకున్న బీసీ సంఘాల నేతల సమావేశం వాయిదాపడింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేసినట్లు ప్రకటించుకోవాల్సి వచ్చింది. ముందుచూపు లేని కారణంగా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదాసీనంగా వ్యవహరించారన్న చర్చలు జోరందుకున్నాయి. అన్ని అంశాలపై మాట్లాడే హరీశ్‌రావు ఇప్పటివరకు బీసీ ఇష్యూపై నోరెత్తలేదన్న మాటలూ నేతల నుంచి వినిపించాయి.

కౌన్సిల్ వేదికగా కవితకు మాట్లాడే అవకాశాన్ని పార్టీ ఇవ్వకపోవడంతో మీడియా పాయింట్ దగ్గర తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశాలు లేకపోలేదు. కవిత ప్రస్తావించిన అంశాలతో బీసీ సంఘాలు ఏకీభవిస్తున్నాయనే మెసేజ్ ఇప్పటికే ఒక సెక్షన్‌లోకి వెళ్ళిందని ఆ సంఘాల ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ ఇష్యూలో ఒకవైపు పార్టీ చొరవ తీసుకోవడంలో విఫలమై ఫూలే ఫ్రంట్ పేరుతో కవిత చేపట్టే యాక్టివిటీస్‌కు ఆదరణ రావడంతో ఆమెను కట్టడి చేయడానికి పార్టీ నాయకత్వం చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించిందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఏకకాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అన్న కేటీఆర్‌కు, పార్టీ నాయకత్వానికి చెల్లి కవిత ఈ ఇష్యూలో అడ్వాన్సుగా వ్యవహరించి ఝలక్ ఇచ్చారనే చర్చ అటు పార్టీలో ఇటు సోషల్ మీడియాలో మొదలైంది.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?