MLC Kavitha
తెలంగాణ

MLC Kavitha | ఊహకందని కవిత ఎత్తుగడ… డైలమాలో గులాబీ అధిష్ఠానం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కులగణన, బీసీ ఇష్యూలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి మింగుడుపడడంలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సభా కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బ‌య‌ట‌కు వెళ్ళిపోయినా ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ కవిత మాత్రం సభలోనే ఉండిపోవ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చకు దారితీసింది. పార్టీ నిర్ణయం ఒక రకంగా ఉంటే అందుకు భిన్నంగా కవిత వ్యవహరించడం పార్టీ నాయకత్వానికి జీర్ణం కాలేద‌ని చెబుతున్నారు.

విధానపరంగానే ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియను, నివేదికలోని అంశాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కవిత ఎందుకు పాటించలేదనే గుసగుసలు మొదలయ్యాయి. ఆమెను మందలిస్తే బీసీ సంఘాలు ఆమెకు అండగా ఉంటాయన్న భయం ఒకవైపు… ఆమెను ప్రశ్నించకపోతే దీన్ని అడ్వాంటేజ్‌గా మల్చుకుని మరింత దూకుడుగా వ్యవహరిస్తారేమోననే అనుమానం మరోవైపు.. వెర‌సి క‌విత వ్య‌వ‌హారం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కక్కలేని మింగలేని స్థితిలో ప‌డిన నాయ‌క‌త్వానికి కవితను కట్టడి చేయడం చిక్కు ప్రశ్నగా మారింది.

పార్టీ ప‌ట్టించుకోనందుకే?

యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేరుతో యాక్టివిటీస్ ప్రారంభించడానికి ముందే బీసీ ఇష్యూను పార్టీ టేకప్ చేస్తే మంచిదంటూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఒక ప్రతిపాదన చేశారని, కానీ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆమె స్వంతంగా టేకప్ చేయాల్సి వచ్చిందన్నది పార్టీలోని కొద్దిమంది లీడర్ల వాదన. పార్టీ చేపట్టాల్సిన అంశాన్ని లైట్‌గా తీసుకోవడంతో కవిత దాన్ని అందుకున్నారని, ఒక శక్తిగా ఉండే పార్టీకంటే వ్యక్తిగా కవితకు మైలేజ్ వచ్చిందన్నది ఆ నేతల వాదన. ఢిల్లీ లిక్కర్ కేసు తెరమీదకు వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు హాజరు కానీయకుండా ఆమెను దూరంగానే ఉంచారన్న అపవాదు ఉన్నది. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో ఆమెను హైలైట్ కాకుండా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించిందన్న ఆరోపణలూ ఉన్నాయి.

పార్టీ నుంచి చేదు అనుభవాలు ఎదురైనా సొంతంగానే తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేరుతో కవిత యాక్టివిటీస్ ముమ్మరం చేశారు. పార్టీలో ఇతర నేతలకంటే కూడా బీసీ ఇష్యూలో యాక్టివ్‌గా ఉంటూ బీసీ సంఘాల ప్రతినిధులతో ఆమె సమావేశాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు బీసీ సంఘాలను కూడా సమాయత్తం చేశారు. కానీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనకబడే ఉండటంతో ఆమెను ప్రశ్నించడానికి తగిన గ్రౌండ్ లేకుండాపోయింది. ఒక దశలో బీసీ సంఘాల నేతలు సైతం పార్టీ కంటే ఆమెవైపే మొగ్గు చూపార‌న్న టాక్ బీఆర్ఎస్‌లో మొదలైంది. తాజాగా కులగణన విషయంలో మండలి వేదికగా పార్టీ లైన్‌కు భిన్నంగా ఆమె వ్యవహరించడంతో ప్రశ్నించడానికి ఆ పార్టీ ఎమ్మెల్సీలకు ధైర్యం చాలట్లేదు. పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం కవితను నిలువరించలేక డిఫెన్సులో పడ్డార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కుల గ‌ణ‌న‌కు స‌హ‌క‌రించిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)..

కుల గ‌ణ‌న‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు వివరాలను ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి వేలెత్తి చూపారు. ఎమ్మెల్సీ కవిత మాత్రం సర్వే ప్రక్రియలో భాగంగా ఇంటికి వచ్చిన ప్రభుత్వ సిబ్బందికి సహకరించి వివరాలు అందించారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటే కవిత అందుకు భిన్నంగా వ్యవహరించడం అప్పట్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇపుడు వాకౌట్ విషయంలోనూ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు భిన్నంగా సొంత నిర్ణయం తీసుకుని సభలోనే ఉండిపోవ‌డం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమెను కట్టడి చేయడానికి నాయకత్వం ఏ ప్రయత్నం చేసినా పార్టీలో సహాయ నిరాకరణ జరుగుతుందన్న అంశాన్ని సూటిగా ప్రస్తావించి నిలదీస్తారేమోననే అనుమానం లేకపోలేదు. రానున్న రోజుల్లో కవిత బీఆర్ఎస్‌లోనే ప్రత్యామ్నాయ కేంద్రంగా మారుతారేమోననే మాటలు వినిపిస్తున్నాయి.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?