MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1.80 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిందన్నారు. స్వల్ప వ్యవధిలో భారీగా అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వలేదని మహాలక్ష్మీ పథకాన్ని అసంపూర్ణంగా వదిలేశారని, నెలకు రూ.2,500 కోసం మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు కూడా చేయలేదనక్నారు. పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి చేయకుండా అప్పుగా తెచ్చిన రూ.1.80 లక్షల కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.
గతంలో చేసిన అప్పులకు రూ.80 వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చెల్లించిందని మిగతా లక్ష కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి భారీ ఎత్తున కమీషన్లు తీసుకొని బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని ఆరోపించారు. తాను పూర్తి ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని, ఇది 20 శాతం కమీషన్ సర్కార్ అని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్ రెడ్డి కమీషన్ల రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా సొమ్ము తన సొంత ఖజానాకు చేర్చుకున్నారని ఆరోపించారు. తాను చెప్పేది అబద్ధమైతే అప్పులు, రుణాల తిరిగి చెల్లింపులు, ప్రభుత్వ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ మంత్రికి చెందిన సొంత కాంట్రాక్టు సంస్థకు, మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి బిల్లులు చెల్లించడం మినహా రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. సుమారు రూ.2లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. 16 నెలల్లోఒక్క చెరువులో తట్టెడు మట్టి తీశారా అని నిలదీశారు.
Also Read: Etela Rajender on TG CM: హైడ్రాతో ఏం సాధించారు.. కూల్చడమే మీ విధానమా.. సీఎంపై ఈటెల ఫైర్!
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కంచపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రతిష్టను తన మాటలతో దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం వ్యాఖ్యలు ఉద్యోగులకు చేసిన వాగ్దాలు ఎగ్గోట్టాలి..6 గ్యారెంటీలు ఎగ్గొట్టాలి..అన్ని ఎగ్గొట్టాలి.. కమీషన్లు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని, పెద్ద ఎత్తున చెట్లను నరికేసి ప్రకృతిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను రేవంత్ రెడ్డి దెబ్బతీశారని మండిపడ్డారు. తెలంగాణ భూములను సీఎం రేవంత్ రెడ్డి స్టాక్ ఎక్స్చేంజీలో కుద బెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని లక్ష 75 వేల ఎకరాల టీజీఐఐసీ భూములను స్టాక్ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందన్నారు. టీజీఐఐసీ హోదాను మార్చడం ద్వారా రూ.వేల కోట్ల అదనపు రుణాలు సేకరించాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఎజెండాగా ఉందన్నారు. టీజీఐఐసీ హోదాను మార్చిన విషయం ప్రజలను చెప్పకుండా ఎందుకు దాచి పెట్టారని.. రహస్యంగా, దొంగచాటు జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపద అయిన భూములను స్టాక్ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టాల్సిన అవసనరం ఏమొచ్చిందని నిలదీశారు. రాష్ట్ర ప్రజల భవిష్యతు గురించి కనీసం ఆలోచన లేకుండా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఏమిటని నిలదీశారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవ్వన్నీ ఎవరు చేస్తున్నారో అన్ని తెలుసు
నా గురించి రకరకాల కథనాలు వస్తనేముంటాయి రకరకాల ఆరోపణలు, కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా నాపై ప్రేమ, అభిమానం ప్రదర్శిస్తున్నాయన్నారు. నేను రిక్వెస్టు చేసేది ఒక్కటే.. ఇవ్వన్నీ ఎవరు చేస్తున్నారో అన్ని తెలుసు అన్నారు. సమయం.. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని, ఇలాంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నానన్నారు. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానన్నారు. రాష్ట్రంలోని 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని స్పష్టం చేశారు.
ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందన్నారు. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదన్నారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయన్నారు. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా… ఇంకా కష్టపెడతారా? అని మండిపడ్డారు. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని స్పష్టం చేశారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందనుకుంటున్నట్లు వెల్లడించారు. నేను యూట్యూబ్ హక్కుల కొట్లాడుతుంటే మీరు నా పై ఇష్టం వచ్చినట్లు వార్తలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి అందాల పోటీలపైనే శ్రద్ధ
ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. సోమవారం రామప్ప రామలింగశ్వేరస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2012లోనే రామప్ప ఆలయానికి 5 కి.మీ.ల దూరంలో ఓపెన్ కాస్ట్ మైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్ కాస్ట్ మైన్ పేరుతో బొగ్గు తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారనిఅన్నారు.
యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఈ ఒక్క ప్రయత్నంతో తేలిపోతుందన్నారు. ములుగు నియోజకవర్గంలో రైతులు, ప్రజలు చనిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీతక్కకు ప్రజలపై ప్రేమ ఉంటుంది తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదా? అని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదని, ఉన్న పింఛన్ లు పెంచలేదని, మహాలక్ష్మీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
దేశ సరిహద్దుల్లో ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మన ముఖ్యమంత్రి అందాల పోటీలకు హాజరయ్యారని.. ఈ ముఖ్యమంత్రికి, మంత్రి సీతక్కకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. ఎరుకల నాంచారమ్మ ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. రామానుజపురంలో నాంచారమ్మ జాతరకు హాజరై నాంచారమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం ఎరుకల కులస్తులతో కలిసి కవిత సహపంక్తి భోజనం చేశారు.
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. వాటిలో తెలంగాణనే నెం.1.. సీఎం వెల్లడి