MLA Veerlapalli Shankar: షాద్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత అంజయ్య యాదవ్ స్వగ్రామమైన ఏక్లాస్ కాన్ పేట గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హంగామా చేశారు. శనివారం కేశంపేట మండల పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే స్వగ్రామం ఎక్లాస్ ఖాన్ పేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఆసక్తికర సంఘటన ఆవిష్కృతమైంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్ కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డీజే సౌండ్స్, టపాసుల మోత, పూల వర్షంతో స్వాగతం పలుకుతూ హంగామా సృష్టించారు.
కార్యకర్తల జోష్ కి ఫిదా అయిన నాయకులతో కలిసి స్టెప్పులేసి అధరహో అనిపించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై, బీ బీఆర్ఎస్ పార్టీ పై అవకాశం చిక్కినప్పుడల్లా విరుచుకుపడే కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలో హల్ చల్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.
Also read: Minister Seethakka: ఏజెన్సీల్లో రోడ్డు మార్గాలు.. అధికారుల మీనమేషాలు!
ఎప్పుడూ ప్రతిపక్ష నేతలపై విరుచుకు పడే ఎమ్మెల్యే.. ఈసారి ఇలా ఝలక్ ఇచ్చారని పార్టీ శ్రేణుల్లో చర్చించుకోవడం కనిపించింది. ఏ క్షణం.. ఏ రకమైన ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయోనని! పోలీసులు ముందస్తుగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. ఏక్లాస్ కాన్ పేట గ్రామానికి చెందిన 37 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. శనివారం లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్ట్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతోందని, కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు ధోరణి ఉండదన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
