తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో మరోమారు ఎమ్మెల్సీ (Mlc) నగారా (Election) మోగింది. ఎమ్మెల్యే కోటాలో (Mla Quota) వచ్చే నెల 29న మరో 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) సోమవారం ప్రకటించింది. ఏపీలో (AP) సైతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా వాటికీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 10వ తేదీవరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు గడువు ఇచ్చారు. 20న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజూ కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 24వ తేదీవరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈసీ ఎన్నికల షెడ్యూల్ లో పేర్కొంది. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి శుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండి పదవీకాలం ముగియనున్నది. బీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి శుభాష్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన యెగ్గె మల్లేశం ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫెండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 3 గెలుచుకునే అవకాశం ఉన్నది. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం లభించనున్నది.
ఏపీలో..
ఏపీ నుంచి 5 ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగియనుంది. వారిలో క్రిష్ణమూర్తి జంగా, యనమల రామకృష్ణుడు, పీ అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు ఉన్నారు. సంఖ్యాబలం రీత్యా ఈ ఐదు స్థానాలనూ ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం చేజిక్కించుకోనుంది.