Tummala Nageswara Rao: పత్తి సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు గాను ప్రతి పత్తి కొనుగోలు కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పత్తి సేకరణపై సమీక్షించారు. సీసీఐ ఆహ్వానించిన టెండర్లను ఈ నెల 10న ఓపెన్ చేయగా, వాటిలో మొత్తం 328 జిన్నింగ్ మిల్లులు పాల్గొన్నాయని, టెక్నికల్ టెండర్లు 11న పూర్తయ్యాయని మార్కెటింగ్ శాఖల అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే సంబంధిత జిన్నింగ్ మిల్లుల జాబితాను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని, ఆ తర్వాత ఆయా మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
పత్తి అమ్మకం కోసం సీసీఐ ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఈ క్రమంలో రైతులకు మొబైల్ నంబర్లు మార్చడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల యాప్‌లో లాగిన్ కావడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ మాట్లాడుతూ, ఆధార్ నంబర్ + ఓటీపీతో లాగిన్ చేసే అవకాశం కల్పించాలని, అలాగే డేటాబేస్‌లో లేని రైతులకు కొత్త రిజిస్ట్రేషన్ సదుపాయం ఇవ్వాలని సీసీఐ అధికారులను కోరామన్నారు.
Also Read: Minister Sridhar Babu: వరంగల్ నల్గొండ జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్.. టీ హబ్ తరహాలో ఏర్పాటు!
కపాస్ కిసాన్ యాప్ ద్వారా..
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల నమోదు ప్రక్రియ మొదటిసారిగా చేపడుతున్నందున, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించి, వారికి యాప్ ద్వారా నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1800 599 5779 ఏర్పాటు చేసి, ఉదయం 7.00 గంటల నుంచి రాత్రి 9 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు అధికారులు వివరించారు.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ సవాల్.. సుప్రీం విచారణపై ఉత్కంఠ?
