Mulugu Development: ములుగు జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. మంత్రి దనసరి అనసూయ సీతక్క చేస్తున్న పోరాట ఫలితంగా ములుగు ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క నేతృత్వంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు 9వ సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ప్రాంతాల గుండా రోడ్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, సబ్‌స్టేషన్ల నిర్మాణం, స్టాండింగ్ కమిటీ ఏర్పాటు వంటి పలు అంశాలపై చర్చించారు. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన 0.80 హెక్టార్ల అటవీ భూమిని బదిలీ చేయాలని నిర్ణయించారు. నివాస ప్రాంతాల్లో అటవీ జంతుల కట్టడి కోసం నాలుగు క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు (క్యూఆర్టీ)ఏర్పాటు చేయాలని, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని, అరణ్య భవనలో ప్రత్యేకంగా టైగర్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలను ములుగు ఏజెన్సీ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతి తెలిపింది.
Also Read: TFCC: కార్మికుల వేతనాల పెంపుపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయం
సీతక్క చొరవతో ఏజేన్సీ గ్రామాల్లో 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రహదారుల సమస్యలకు ముగింపు పలికినట్లయింది. ములుగు జిల్లాలోని కంతనపల్లి, లవ్వాల్, కొండపర్తి, కొడిశెల, ఐలాపురం, పాకాల కొత్తగూడెం నుండి దుబ్బగూడెం వరకు రహదారుల నిర్మాణం కోసం చాలా కాలంగా సీతక్క ఒత్తిడి చేస్తున్నారు. రహదారుల నిర్మాణానికి వైల్డ్ లైఫ్ బోర్డు అంగీకరించింది. ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. పాకాల కొత్తగూడెంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి క్లియరెన్స్ లభించింది. తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రత్యేక సఫారీ వాహనాలపై బోర్డు అనుమతులు మంజూరు చేసింది.
సీతక్క మాట్లాడుతూ అడవులతో ఆదివాసీల జీవితం అనుసంధానమై ఉందన్నారు. వారి అభివృద్ధికి చట్టాలు అడ్డుకాకూడదన్నారు. పోడు భూములకు సరైన సరిహద్దులు గుర్తించాలి కోరారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో ఉన్న ఆవాసాలకు విద్యుత్, ఆసుపత్రి వంటి మౌళిక వసతులు కల్పించడానికి అభ్యంతరాలు ఎందుకని అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు. పోడు భూముల సాగుకు అవసరమయ్యే విద్యుత్ కనెక్షన్ల మంజూరును అడ్డుకోవద్దని సూచించారు. పోడు రైతుల అభ్యంతరాలు తెలుసుకునేందుకు జిల్లా ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మురళీ నాయక్, రామ్ దాస్ నాయక్, వెడ్మా బొజ్జూ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఈలు సింగ్ మేరు, ఇతర అటవీ శాఖ పాల్గొన్నారు.