Sarpanch Candidate: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వరాల జల్లు కురిపిస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల మీద హామీలు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా (Medak District)లోని ఓ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిని.. ఓటర్లకు ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు. రూ.100 బాండ్ పేపర్ పై 15 హామీలతో మేనిఫేస్టో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మేనిఫెస్టో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సర్పంచ్ అభ్యర్థి ఎవరంటే?
మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ (Havelighanpur) మండలం కాప్రాయిపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిని కుక్కల మౌనిక.. ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టోను విడుదల చేశారు. రూ. 100 బాండ్ వాటిని ప్రచురించడం ద్వారా ఓటర్లలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. తనను గెలిపిస్తే మేనిఫెస్టోలోని 15 హామీలను నెరవేరుస్తానని.. లేని పక్షంలో తనను తొలగించవచ్చని పేర్కొంటూ ఆ బాండ్ ను రూపొందించడం విశేషం. దీంతో మౌనిక ఇచ్చిన హామీలపై ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ హామీలు ఏంటంటే?
సర్పంచ్ అభ్యర్థిని కుక్కల మౌనిక రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఆసక్తికరమైన హామీలు ఉన్నాయి. 6 నెలల లోపు కొత్త ట్రాలితో చెత్త సేకరణ, ఇంటివద్దకే పెన్షన్ డబ్బులు, ప్రతీరోజూ మంచి నీటి సరఫరా, కొత్తగా మహిళ సంఘాలు ఏర్పాటు చేసి రూ.1 లక్ష లోన్ మంజూరు చేయడం వంటివి అందులో ఉన్నాయి. అలాగే తీజ్ పండుగకు రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు, ఎల్లమ్మ బోనాలకు రూ.3 వేలు, ఆడపిల్ల పుడితే రూ.వేలు, అకారణంగా చనిపోతే రూ.5 వేలు ఆర్థిక సాయం చేస్తామని సర్పంచ్ అభ్యర్థిని చెప్పారు.
Also Read: Pawan – Komatireddy: పవన్ క్షమాపణ చెప్పాలి.. లేదంటే సినిమాలు ఆడనివ్వం.. కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
పోస్టుల భర్తీకి హామీ..
ప్రతీ నెల మూడో వారంలో గ్రామ పంచాయతీ నిర్వహిస్తానని నక్కల మౌనిక మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. అలాగే 5 గ్రామ పంచాయతీ పోస్టుల భర్తీ, పంచాయతీ పరిధిలోనే జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, ప్రతీ జాబ్ కార్డుకు 80 శాతం పని కల్పించడం, కేసీఆర్ ఇచ్చిన గృహలక్ష్మీ పథకంలోని రూ.3 లక్షలు వచ్చేలా చేయడం వంటి హామీలను ప్రకటించారు. పై హామీలను అమలు చేయని యెడల కలెక్టర్ గానీ, న్యాయస్థానం గానీ తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించుకోవచ్చని చివర్లో నక్కల మౌనిక స్పష్టం చేశారు.
సర్పంచ్ ఎన్నికల వేళ అభ్యర్థుల వరాల జల్లు..
మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం కాప్రాయిపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుక్కల మౌనిక
రూ.100 బాండ్ పేపర్ పై 15 హామీలతో మేనిఫెస్టో
తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని లేకుంటే తనను తొలగించవచ్చని… pic.twitter.com/aioGPfZcSe
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025

