Maoist Surrender: ఛత్తిస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియా బంద్ ప్రాంతంలో చురుకుగా ఉండే ఏరియా కమిటీ నాయకుడు సునీల్ ఛత్తీస్గడ్ ప్రాంతంలోని భారీగా మావోయిస్టులను లొంగిపోయేందుకు పిలుపునిస్తూ ఓ లేఖ శనివారం విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఎక్కువమంది తెలుగువారు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఉన్నారు. ఇందులో నుంచి భారీగా మావోయిస్టులు సునీల్ విడుదల చేసిన లేఖ కు ఆకర్షితులై లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అగ్రనేతల్లో అధిక శాతం తెలంగాణ వాసులే ఉన్నట్లుగా ప్రచారం ఉంది. కేంద్ర కమిటీ మావోయిస్టు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేంద్ర కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే, 8 నుంచి పదిమంది వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని సమాచారం.
ఇటీవల కాలంలో లొంగిపోయిన ముఖ్య నేతలు
పోలీస్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ ప్రధాన సైద్యాంతిక వ్యూహకర్త తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కు చెందిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను దాదా అలియాస్ భూపతి అలియాస్ అభయ్, కేంద్ర కమిటీ సభ్యురాలు, చత్తీస్గడ్ సౌత్ జోనల్ బ్యూరో ఇన్చార్జి గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు కు చెందిన పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, కేంద్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్, సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య, హనుమకొండ జిల్లాకు చెందిన వెంకటరాజు లతోపాటు పలువురు కీలక రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోయారు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ వాసి
పోలీస్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ మావోయిస్టు అగ్ర నేతలు వరుసగా మరణించడం, లొంగిపోవడం తో మావోయిస్టు పార్టీ ఉద్యమం తీవ్రస్థాయిలో బలహీనపడింది. ఈ నేపథ్యంలో దేవూజీ ని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ నియమించింది. పోలీసులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందినవారు 72 మంది వరకు ఉన్నారు. దేవూజీ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వరుస దెబ్బలు తగిలిన మావోయిస్టు పార్టీకి తిరిగి నాయకత్వ జవజీవాలను తీసుకొస్తున్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని కొనసాగించే బాధ్యత దేవూజీ, హిడ్మా వంటి మిలిటరీ కమాండర్ల చేతిలో ఉంది. అయితే ఇప్పటివరకు ఛత్తీస్గడ్ రాష్ట్రంలో నుంచి అత్యధికంగా మావోయిస్టులు లొంగిపోయిన చరిత్ర ఉంది. కాగా, సోమవారం తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు పార్టీ వివిధ క్యాడర్లలో ఉన్నవారు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
