Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) ప్రస్తుతం కాకరేపుతోంది. ఈ కేసులో సాక్షిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావును (Harish Rao) నిన్న (జవవరి 20) సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ పార్టీల (BRS Party) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆరోపణలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కౌంటర్లు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి పాత్ర ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోషులేనని మండిపడ్డారు. ఈ మేరకు నిజామాబాద్‌లో ఆయన మాట్లాడారు.
తప్పు చేయకుంటే సంజాయిషీ ఇవ్వండి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజంగా తప్పు చేయకుంటే సంజాయిషీ ఇచ్చుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులకు మహేష్ కుమార్ గౌడ్ సవాలు విసిరారు. రాజకీయ లబ్ధి పొందాలని చూడొద్దని హితవుపలికారు. సింగరేణి కాలరీస్ అంశంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా దోపిడీ చేశారో నిరూపిస్తామని ఆయన అన్నారు. బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్ని శాఖల్లో పారదర్శకత తెచ్చామని ఆయన తెలిపారు.
బీజేపీ నేతలకు సైతం కౌంటర్లు
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొవద్దంటూ బీజేపీ నేతలపై మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నిజామాబాద్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి టెండర్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తామని ఆయన సవాలు విసిరారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
Read Also- GHMC: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభం.. ఎన్నికల నిర్వహణ పై కీలక అప్డేట్..?

