AICC Meenakshi Natarajan: మహబూబ్ నగర్ నేతలతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన సమావేశం రసాభాసగా సాగింది. జిల్లా ఎమ్మెల్యేలు.. మీనాక్షి ముందు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని.. ప్రాజెక్టులు కాంట్రాక్టులు కూడా ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియడం లేదని వాపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్డిలకు పదవులు ఎక్కువ అయ్యాయని.. బీసీ, ఎస్సీలకు పార్టీలో పదవులు ఇవ్వాలని కోరారు.
పథకాలపై సమాచారం ఇవ్వట్లేదు
కాంగ్రెస్ కార్యకర్తలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జిల్లా నేతలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్లకు ఏం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పాలనా వ్యవహారమంతా అధికారుల ద్వారానే జరుగుతున్నట్లు మీనాక్షికి తెలియజేశారు. తాము సూచించిన అధికారులకు పోస్టింగ్స్ కూడా ఇవ్వట్లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వాలని.. తమ సలహాలు కూడా తీసుకుంటే బాగుటుందని మహబూబ్ నగర్ నేతలు సూచించారు.
ఎంపీ మల్లుపై ఫిర్యాదులు
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవిపై ఆలంపూర్ కు చెందిన సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కమీషన్ తీసుకొని బీఆర్ఎస్ నేతల ఫైనాన్స్ బిల్లులను క్లియర్ చేయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ కాకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ కావడం పట్ల ఆలంపూర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని మల్లు రవి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Kamal Haasan: బాలీవుడ్‌పై ఓపెన్ అయిన కమల్.. మూవీస్ చేయకపోవడంపై షాకింగ్ కామెంట్స్!
ఆ నేతలపైనా అసంతృప్తి
క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి చర్యల వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేకాదు మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇంటికి పిలిపించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనతో కలిసి తేనేటీ విందులు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిని తెలియజేశారు. అటు గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిలపై కూడా అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.