కృత్రిమ కొరత సృష్టించొద్దని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచన
Urea Shortage: మహబూబాబాద్, స్వేచ్ఛ: యూరియా కృత్రిమ కొరతను (Urea Shortage) సృష్టించొద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. మంగళవారం గూడూరు మండలంలోని సహకార సంఘం కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా గోదాంలో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. రైతులకు ఎరువులు సమయానికి అందేలా గోదాంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు.
వ్యవసాయయేతర అవసరాలకు యూరియాను వినియోగిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. యూరియా కోసం రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో అందించాలని అధికారులను కోరారు. యూరియా స్టాక్‌ను ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు ప్రైవేటు డీలర్ల ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.
రైతులకు అవగాహన కల్పించాలని, వారి అవసరాలకు సరిపడా యూరియాను పంపిణీ చేసేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించొద్దని స్పష్టం చేశారు. వీలైతే టోకెన్ల ద్వారా అమ్మకాలు జరపాలని వివరించారు. పూర్తిస్థాయిలో యూరియా అమ్మకాలపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టిందని హెచ్చరించారు. అన్ని మండలాలకు యూరియా నిలువలు వచ్చేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి మండలానికి యూరియా లోడ్‌లు వస్తాయని, రైతులు కొంత సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు.
Read Also- ACB officials: ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.. ఎంత లంచం అడిగారంటే
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీఎస్సీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి యూరియా బస్తాల కోసం రైతులు క్యూ లైన్‌లో నిలబడి ఎదురు చూశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కో బస్తా అందేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయని, వర్షాల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో సరైన సమయంలో రైతులకు ప్రభుత్వం అందించలేకపోతుందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ తెలిపారు. ప్రతి ఒక్కరు సంయమనం పాటించి సహకరించాలని ఆయన కోరారు.