Dornakal Irrigation Department: డోర్నకల్ ఇరిగేషన్ ఆఫీసులో మందు పార్టీ తో అధికారులు మద్య మత్తులో మునిగి తేలుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో అధికారి నిద్రమత్తు లో మునిగిపోయాడు. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని వింత వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు పలు శాఖలపై దృష్టి సారించకపోవడంతో అధికారులు కొంతమంది మద్యం మత్తులోకి, మరికొంతమంది నిద్రమత్తులోకి జారుకుంటున్నారు. కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం మహబూబాబాద్ జిల్లా లోని పలు మండలాల నుంచి ప్రజలు వస్తున్నారు. దీంతో ఆ ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో పలు రకాల ఘటనలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి సాదాసీదా ప్రజల్లాగానే పల్లెటూరి గ్రామాల్లో మద్యం మత్తులకు వెళ్తున్నట్లుగా అధికారుల తీరు ఉండడంతో ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పల్లెటూరు గ్రామాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చిన్న చిన్న పంచాయతీలు, వివిధ రకాల కార్యక్రమాలతో అక్కడి వారంతా మద్యం కు అధిక ప్రయారిటీ ఇస్తారు. అలా నలుగురు ఒకచోట కూడి మద్యం సేవించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా తరచూ పల్లెటూరు గ్రామాల్లో పార్టీలు, డిన్నర్లు చేసుకోవడం విరివిగా కనిపిస్తుంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న అధికారులు తమ స్థాయి మరచి సాధారణ వ్యక్తుల్లాగానే మద్యం పార్టీలు చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్లడవుతున్నాయి.
సాధారణ ప్రజల నుంచి వ్యాపారుల వరకు చెల్లించే పన్నుల ద్వారా జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు చేయాల్సిన సకర్యాలను మర్చిపోయి మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా రాష్ట్రంలో చాలాచోట వివిధ కార్యాలయాల్లో మద్యం సేవిస్తున్న ఘటనలు కనిపిస్తుండడం కొంత ఆందోళనకు గురి చేసే అంశాలుగా ప్రజలు పరిగణిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మిట్ట మధ్యాహ్నం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అధికారులను శాశ్వతంగా విధులకు దూరం చేసి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది అధికారులు మధ్యమధ్యలో మునిగి తేలుతుంటే మరి కొంత మంది ఉద్యోగులు తమ సీట్లనే మంచాలుగా భావిస్తూ అక్కడ మధ్యాహ్నపు కునుకు తీస్తున్నారు. ఇలాంటి అధికారులపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి జిల్లా స్థాయి ఉన్నత అధికారులు తగిన శాఖపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటున్నారు. జిల్లాస్థాయి అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
రెయిన్ అలర్ట్ సమయంలో అధికారుల మధ్య మత్తు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల విభాగాల కంటే ముందు అప్రమత్తంగా ఉండాల్సిన ఇరిగేషన్ అధికారులు మద్యం మత్తులో తూలుతున్నారు. నలుగురు నవ్విపోతే నాకేటి సిగ్గు అన్న చందంగా ఇరిగేషన్ అధికారుల తీరు ఉండడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. మిగిలిన శాఖలకు ఆదర్శంగా నిలుస్తూ వర్షాభావ ప్రభావం వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులు తొలగించేందుకు శ్రమించాల్సిన అధికారులు మద్యం మత్తులో ఉండడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇవే మొదటి ఘటనలు కావని, ఇంతకుముందు చాలాచోట్ల ప్రభుత్వ కార్యాలయాలలో మద్యం మత్తులో మునిగి తేలడం, మధ్యాహ్న సమయంలో నిద్రమత్తులో అధికారులు రెస్ట్ తీసుకోవడం తరచు కనిపిస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయని ప్రజలు చర్చ సాగిస్తున్నారు.
పక్కా సమాచారంతో పోలీసుల రైడ్స్
మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండల ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులు మందు పార్టీ చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కార్యాలయం పై ఆకస్మికంగా రైడ్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మద్యం మత్తులో విధులను మరిచిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు పగలంతా ప్రజల కోసం చేయాల్సిన సేవలు మరిచి, మద్యం మత్తులో ఆనందపు అంచులను చూస్తున్నారని ఆ కార్యాలయ పరిసర ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు స్థానిక ప్రజలు సమాచారం అందించడంతోనే ఆ కార్యాలయం పై ప్రత్యేక రైట్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం సేవించడం నేరమని తెలిసినప్పటికీ ఆ ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ దుశ్చర్యకు పాల్పడడం సమంజసం కాదని స్థానికులు గుసగుసలాడుకోవడం గమనార్హం.